దారి వివాదంలో రక్తపాతం
రైతుపై హత్యాయత్నం.. వర్ధన్నపేటలో దారుణ ఘటన
పొలానికి వెళ్లిన రైతుపై సామూహిక దాడి
మారణాయుధాలతో విచక్షణారహిత దాడి
తీవ్రంగా గాయపడిన రైతు న్యాయం రవీందర్ రెడ్డి
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : దారి వివాదం రక్తపాతానికి దారి తీస్తోందని, రైతుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోందని న్యాయం రవీందర్ రెడ్డి రైతుపై జరిగిన దారుణ దాడి ఘటనతో మరోసారి బయటపడింది. వర్ధన్నపేట పట్టణ పరిధిలోని దమ్మన్నపేట శివారు దొడ్లగడ్డలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. పొలానికి వెళ్లిన సమయంలో న్యాయం రవీందర్ రెడ్డి అనే రైతుపై ముగ్గురు వ్యక్తులు ఒక్కసారిగా దాడికి దిగారు. మారణాయుధాలతో విచక్షణారహితంగా కొట్టడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. రక్తపు మడుగులో పడి ఉన్న ఆయనను గమనించిన స్థానికులు వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
పాత కక్షలే కారణమా…
స్థానికుల సమాచారం ప్రకారం, రవీందర్ రెడ్డికి సుమారు 9 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమికి వెళ్లే దారి విషయంలో గత రెండేళ్లుగా పొరుగువారితో వివాదం కొనసాగుతోంది. ఇదే కక్షతో ముందుగా పథకం వేసుకుని దాడి చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రవీందర్ రెడ్డికి భార్య లక్ష్మి, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యులు ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న వర్ధన్నపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మొత్తంగా, చిన్న చిన్న భూ వివాదాలు ప్రాణాలపై ముప్పుగా మారుతున్న ఘటనలు పెరుగుతుండడం కలవరపెడుతోంది.

