గిరిజన సంప్రదాయాలు విస్మరించొద్దు
సంస్కృతి పరిరక్షణకు ఒక్కటిగా నిలవాలి
రిజర్వేషన్లు, పథకాలపై అవగాహన అవసరం
ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు మాలోత్ చిట్టిబాబు నాయక్
బంధనపల్లి గ్రామంలో గోర్ సేన ఆధ్వర్యంలో చైతన్య సదస్సు
కాకతీయ, రాయపర్తి : గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి సమాజం ఒక్కటిగా ముందుకు రావాలని ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు మాలోత్ చిట్టిబాబు నాయక్ పేర్కొన్నారు. మండలంలోని బంధనపల్లి గ్రామంలో గోర్ సేన, గోర్ సిక్వాడి సామాజిక సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన గిరిజన చైతన్య సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సర్పంచ్ గుగులోత్ అక్రీ రాంజీ నాయక్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో గిరిజనుల సాంప్రదాయాలు, వేషాధారణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వివాహాలు, పండగలు వంటి సందర్భాల్లో తమ మూలాలను మరువకుండా గౌరవించాలని హితవు పలికారు. తెలంగాణలో ఉన్న గిరిజనుల అస్తిత్వాన్ని కాపాడుకోవడం అత్యంత అవసరమని, యువత తమ హక్కుల సాధనకు ముందుండాలని పిలుపునిచ్చారు.
హక్కుల సాధనకు ఐక్యత అవసరం
సమాజంలో బంజారా వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు అందరూ కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. గోర్ సిక్వాడి జిల్లా అధ్యక్షుడు మహేశ్వర్ నాయక్ గిరిజనుల విద్య, ఉద్యోగ అవకాశాలు, రిజర్వేషన్లపై తండా వాసులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పథకాలపై పూర్తి సమాచారం తెలుసుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సర్పంచ్ గుగులోత్ అక్రీ రాంజీ నాయక్ మాట్లాడుతూ బంజారాల ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ మహారాజ్ చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. సమాజంలో ఐక్యతతో ముందుకు సాగితేనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. కార్యక్రమంలో గుగులోత్ వాలు నాయక్, కృష్ణ నాయక్, వెంకన్న నాయక్, శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

