కార్మిక హక్కుల పరిరక్షణకు పోరాడాలి
ఎనిమిది గంటల పని విధానాన్ని కాపాడుకోవాలి
ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి శింగు నర్సింహారావు
కార్మికుల హక్కులు హననం అవుతున్నాయని ఆవేదన
కాకతీయ, ఖమ్మం టౌన్ : మేడే స్ఫూర్తితో కార్మికులు సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానాన్ని కాపాడుకోవడానికి నిరంతరం పోరాడాలని ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి శింగు నర్సింహారావు పిలుపునిచ్చారు. ఖమ్మం గిరిప్రసాద్ భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో 141వ మేడే గోడ ప్రతులను ఏఐటియుసి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బిజి క్లెమెంట్‌తో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా కార్మికుల హక్కులు హననం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మిక హక్కులు క్రమంగా తగ్గుముఖం పట్టాయని విమర్శించారు.
లేబర్ కోడ్లపై విమర్శలు
నాలుగు లేబర్ కోడ్ల అమలు వల్ల కార్మికుల పరిస్థితి మరింత దయనీయంగా మారిందని పేర్కొన్నారు. కార్మిక చట్టాలు ప్రభుత్వాలు ఇచ్చినవి కాకుండా కార్మికులు పోరాడి సాధించుకున్నవని గుర్తుచేశారు. అలాంటి చట్టాలను రద్దు చేసి కొత్త కోడ్లు తీసుకురావడం అవసరమేంటని ప్రశ్నించారు. కార్మికుల పట్ల నిజమైన చిత్తశుద్ధి ఉంటే ఉన్న చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. కార్మికుల కనీస వేతనాలను తగ్గించడం, కార్పొరేట్ సంస్థలకు భారీ రుణ మాఫీలు చేయడం వంటి నిర్ణయాలు కార్మిక వర్గానికి అన్యాయమని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలతో రవాణా రంగ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించడం వల్ల గ్రామీణ కార్మికుల పరిస్థితి మరింత కష్టతరమైందన్నారు.
సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాటాలు సాగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు గాదె లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి తోట రామాంజనేయులు, కార్యనిర్వహక అధ్యక్షుడు రావి శివరామకృష్ణ, మహిళా సమాఖ్య నాయకురాలు పోటు కళావతి, ఉపాధ్యక్షుడు ఎండి జాకీరుద్దీన్, కోశాధికారి షేక్ ఇబ్రహీం, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

