కూసుమంచిలో కోతుల బెడదకు చెక్
ప్రజల ఫిర్యాదులకు స్పందించిన పంచాయతీ
పట్టిన కోతులను అటవీ ప్రాంతాలకు తరలింపు
కాకతీయ, కూసుమంచి : కోతుల బెడదను నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని సర్పంచ్ కొండా కృష్ణవేణి మహిపాల్ తెలిపారు. మండల కేంద్రంలో కోతుల సంచారం పెరిగి ప్రజలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో గ్రామస్తులు పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సర్పంచ్ కొండా కృష్ణవేణి మహిపాల్, పంచాయతీ కార్యదర్శి నీరజ ఆధ్వర్యంలో సోమవారం కోతులను పట్టే కార్యక్రమం చేపట్టారు. జనావాసాల మధ్య సంచరిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న కోతులను బోనుల సహాయంతో పట్టుకున్నారు. ఇప్పటికే పలువురు కోతులను పట్టినట్లు అధికారులు తెలిపారు. పట్టిన కోతులను సుదూర అటవీ ప్రాంతాలకు లేదా పునరావాస కేంద్రాలకు తరలించే చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. మిగిలిన కోతులను కూడా త్వరలో పట్టే కార్యక్రమం కొనసాగిస్తామని తెలిపారు. కోతుల బెడద తగ్గిపోనుండడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

