మొక్కజొన్న కొనుగోలులో ఆంక్షలు ఎత్తివేయాలి
ఎకరాకు 26 క్వింటాళ్ల నిబంధనతో అన్యాయం
బస్తాల కొరత, లారీల రాకలో జాప్యం
అకాల వర్షాల ముప్పు.. తక్షణమే ఎగుమతులు చేపట్టాలి
సొంత నియోజకవర్గ రైతుల సమస్యలపై డిప్యూటీ సీఎం స్పందించాలి
తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు
ఖమ్మం – బోనకల్ రహదారిపై రైతులతో కలిసి రాస్తారోకో
కాకతీయ, చింతకాని: ప్రభుత్వం రైతులు పండించిన మొక్కజొన్నను ఎలాంటి నిబంధనలు లేకుండా పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం – బోనకల్ ప్రధాన రహదారిపై నాగులవంచ వద్ద తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో నిర్వహించారు. మంగళవారం జరిగిన ఈ ఆందోళనతో రహదారిపై రాకపోకలు స్తంభించాయి. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పుకుంటోందే తప్ప, క్షేత్రస్థాయిలో రైతుల ఇబ్బందులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కేవలం మొక్కుబడిగా కేంద్రాలను తెరిచి రైతులకు నరకం చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నిబంధనల పేరుతో వేధింపులు
ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల్లో ఎకరాకు కేవలం 26 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని, కానీ రైతులు ఎకరాకు 40 నుంచి 50 క్వింటాళ్ల దిగుబడి సాధించారని గోపాలరావు వివరించారు. ప్రభుత్వం విధించిన ఈ నిబంధన వల్ల మిగిలిన సగం పంటను రైతులు ఎక్కడ అమ్ముకోవాలని ఆయన ప్రశ్నించారు. ఈ నిబంధనను వెంటనే ఎత్తివేసి పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కొనుగోలు కేంద్రాల వద్ద బస్తాల కొరత తీవ్రంగా ఉందని, రైతులు తమ సొంత డబ్బులతో బస్తాలు కొనుక్కుంటున్నారని, ఇది వారిపై అదనపు భారం మోపడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అకాల వర్షాల భయం.. అధికారుల జాప్యం
కాటా వేసిన మొక్కజొన్నలను తరలించడానికి లారీలు రావడం లేదని, దీనివల్ల 15 నుంచి 20 రోజులుగా పంట కల్లాల్లోనే మగ్గిపోతోందని రైతులు వాపోయారు. అధికారులను అడిగితే లారీలు దొరకడం లేదని సాకులు చెబుతున్నారని విమర్శించారు. ప్రస్తుత అకాల వర్షాల నేపథ్యంలో పంట తడిసిపోతే రైతులకు భారీ నష్టం వాటిల్లుతుందని, వెంటనే లారీలు తెప్పించి ఎగుమతులు చేపట్టాలని కోరారు. మధిర నియోజకవర్గంలోనే అత్యధికంగా సుమారు లక్షన్నర ఎకరాల్లో మొక్కజొన్న సాగైందని, ఇక్కడి ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తన సొంత నియోజకవర్గ రైతుల సమస్యలపై స్పందించకపోవడం దారుణమన్నారు.
పోరాటం ఉధృతం చేస్తాం
డిప్యూటీ సీఎం వెంటనే జోక్యం చేసుకుని మార్క్‌ఫెడ్ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని, లేనిపక్షంలో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యుడు తోటకూర వెంకట నరసయ్య, మండల నాయకులు ఆలేటి రవి, బల్లి చిన్న వీరయ్య, మడిపల్లి కిరణ్ బాబు, ఆళ్ల మాధవరావు, రౌతు అప్పారావు, బండి నరేష్, ఓబన బోయిన అచ్చయ్య, గడ్డం కోటేశ్వరరావు, కూచిపూడి బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు.

