మానని గాయాలు ప్రమాదాలకు సంకేతం..!
డయాబెటిస్ రోగుల్లో రక్తనాళాల సమస్యలపై అప్రమత్తత అవసరం
కాళ్లకు రక్తప్రసరణ తగ్గితే పీఏడీ ముప్పు పొంచి ఉన్నట్లే
చిన్న గాయాలను నిర్లక్ష్యం చేస్తే పుండ్లుగా మారే ప్రమాదం
నడిచేటప్పుడు నొప్పి.. పాదాలు చల్లబడటం వంటివి ప్రధాన లక్షణాలు
ధూమపానం మానేయాలి.. చక్కెర స్థాయిలను నియంత్రించుకోవాలి
ఆధునిక చికిత్సలతో కాలు కోల్పోయే పరిస్థితిని నివారించవచ్చు
ప్రతి నెలా మూడవ మంగళవారం కరీంనగర్‌లో ఓపీ సేవలు
యశోద హాస్పిటల్స్ సీనియర్ సర్జన్ డాక్టర్ డీ. ప్రభాకర్
కాకతీయ, కరీంనగర్: డయాబెటిస్ ఉన్న వారిలో కాళ్లకు రక్తప్రసరణ తగ్గే పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ (పీఏడీ) వేగంగా పెరుగుతోందని యశోద హాస్పిటల్స్ సికింద్రాబాద్ యూనిట్ సీనియర్ కన్సల్టెంట్ వాస్క్యులర్, ఎండోవాస్కులర్ సర్జన్ డాక్టర్ డీ. ప్రభాకర్ తెలిపారు. మంగళవారం కరీంనగర్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ రక్తనాళాల సమస్యలు, వాటి పరిష్కార మార్గాలను వివరించారు. పీఏడీ వల్ల కాళ్లు, పాదాలకు వెళ్లే రక్తనాళాలు ఇరుకుగా మారడం లేదా మూసుకుపోవడం జరుగుతుందని, దీని కారణంగా రక్తప్రసరణ గణనీయంగా తగ్గిపోతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా మధుమేహ బాధితుల్లో చిన్న గాయాలే మానకుండా తీవ్రమైన పుండ్లుగా మారే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు. నరాల సమస్యల కారణంగా కొందరికి నొప్పి కూడా తెలియకపోవచ్చని, ఇది మరింత ప్రమాదకరమని వివరించారు.
లక్షణాలను గుర్తించి అప్రమత్తమవ్వాలి
నడిచేటప్పుడు కాళ్లలో నొప్పి రావడం, త్వరగా అలసిపోవడం, పాదాలు ఎప్పుడూ చల్లగా ఉండటం వంటి లక్షణాలను తేలికగా తీసుకోవద్దని డాక్టర్ ప్రభాకర్ సూచించారు. మానని గాయాలు ఉండటం, కాళ్ల వేళ్లు నల్లబడటం వంటివి కనిపిస్తే వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించాలని కోరారు. కాళ్ల రక్తపోటు పరీక్షలు, డాప్లర్ స్కాన్ వంటి ఆధునిక పరీక్షల ద్వారా సమస్యను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స చేయవచ్చన్నారు. డయాబెటిస్ రోగులు తమ రక్త చక్కెర స్థాయిలను నిరంతరం కట్టుదిట్టంగా నియంత్రించుకోవాలని, పొగతాగే అలవాటు ఉంటే దానిని పూర్తిగా మానాలని హితవు పలికారు. సకాలంలో స్పందిస్తే సాధారణ మందులతో లేదా యాంజియోప్లాస్టీ వంటి అధునాతన పద్ధతుల ద్వారా సమస్యను పరిష్కరించవచ్చని తెలిపారు.
క్రమం తప్పకుండా పాదాల పరిశీలన
రోజూ తమ పాదాలను నిశితంగా పరిశీలించుకోవడం డయాబెటిస్ రోగులకు అత్యంత కీలకమని డాక్టర్ ప్రభాకర్ స్పష్టం చేశారు. చిన్నపాటి రాపిడి లేదా గాయాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య సలహా తీసుకోవాలని కోరారు. ముందస్తు అవగాహన, సకాలంలో చికిత్స అందుకోవడం వల్ల కాలు కోల్పోయే (అంప్యుటేషన్) దుస్థితిని నివారించవచ్చని భరోసా ఇచ్చారు. కరీంనగర్ జిల్లావాసుల సౌకర్యార్థం ప్రతి నెల మూడవ మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్థానిక యశోద మెడికల్ సెంటర్‌లో తన ఓపీ సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. రోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ ప్రతినిధులు నవీన్ చక్రవర్తి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

