టాలెంట్ టెస్ట్‌లతో విద్యార్థుల ప్రతిభా ప్రదర్శన
జిల్లావ్యాప్తంగా 166 విద్యా సంస్థల్లో పోటీల నిర్వహణ
సృజనాత్మకత పెంపొందించడమే సంక్షేమ వారం లక్ష్యం
ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
కాకతీయ, ఖమ్మం: జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తున్న సంక్షేమ వారం కార్యక్రమాల్లో భాగంగా రెండవ రోజు మంగళవారం విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించారు. జిల్లాలోని 166 హాస్టళ్లు, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు (కేజీబీవీలు), గురుకులాలు, ఆదర్శ పాఠశాలల్లో విద్యార్థుల ప్రతిభను వెలికితీయడానికి విభిన్న పోటీలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, ప్రసంగం, క్విజ్, డ్రామా, డ్యాన్స్, సింగింగ్, క్యారమ్ వంటి కార్యక్రమాలతో పాటు కొన్ని విద్యా సంస్థల్లో రన్నింగ్ వంటి క్రీడా పోటీలు కూడా నిర్వహించారు. విద్యార్థులు ఈ పోటీల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు ఈ కార్యక్రమాలు ఎంతగానో దోహదపడుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. పోటీల నిర్వహణను జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు, సంక్షేమ శాఖ సిబ్బంది నిరంతరం పర్యవేక్షించారు. వెల్ఫేర్ వీక్ కార్యక్రమాల ద్వారా విద్యార్థుల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా జిల్లాలోని అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

