అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు.. పలువురికి గాయాలు
కోతిరాంపూర్ బైపాస్ రోడ్డుపై లారీని ఢీకొట్టిన వాహనం
క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించిన పోలీసులు
అనుభవం లేని డ్రైవర్ల వల్లే ప్రమాదమని ప్రయాణికుల ఆరోపణ
కాకతీయ, కరీంనగర్ : రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకున్న బస్సు ప్రమాదం ప్రయాణికులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. బుధవారం ఉదయం కోతిరాంపూర్ బైపాస్ రోడ్డుపై కరీంనగర్-2 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టి, అదుపుతప్పి రోడ్డు మధ్యలోని డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు ముందుభాగం పూర్తిగా ధ్వంసం కాగా, బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు గాయపడిన వారిని బయటకు తీసి చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రులకు తరలించారు.

అనుభవం లేని డ్రైవర్లతోనే ప్రమాదమా?
రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ డ్రైవర్లు సమ్మెలో ఉండటంతో, ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులతో బస్సులు నడిపిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తగిన అనుభవం లేని వ్యక్తులతో వాహనాలు నడిపించడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని స్థానికులు బలంగా అనుమానిస్తున్నారు. సమ్మె ప్రభావం వల్ల ప్రజా రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడమే కాకుండా, ప్రయాణికుల ప్రాణాలకు భద్రత కరువవుతోందని ప్రజలు మండిపడుతున్నారు.
దర్యాప్తు చేపట్టిన పోలీసులు
ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల అసలు కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. కాగా, గాయపడిన వారిలో కొందరి పరిస్థితి స్వల్పంగానే ఉన్నట్లు సమాచారం. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

