కల్వల ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయాలి
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వొడితల ప్రణవ్ వినతి
తనుగుల చెక్‌డ్యాం పునరుద్ధరణకు సైతం విజ్ఞప్తి
మంత్రి నుంచి సానుకూల స్పందన..
త్వరలోనే పనులు ప్రారంభిస్తామని హామీ
కాకతీయ హుజురాబాద్ : వీణవంక, జమ్మికుంట మండలాల రైతులకు సాగునీరు అందించే కల్వల ప్రాజెక్ట్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని హుజురాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ కోరారు. ఈ మేరకు రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని సచివాలయంలోని ఆయన ఛాంబర్లో కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వొడితల ప్రణవ్ మాట్లాడుతూ కల్వల ప్రాజెక్టు పనులు పూర్తయితే ఈ ప్రాంత రైతులకు సాగునీటి కష్టాలు తప్పుతాయని వివరించారు. అలాగే గుంపుల–శంభునిపల్లి గ్రామాల పరిధిలోని తనుగుల చెక్‌డ్యాంను పునరుద్ధరించాలని మంత్రిని కోరారు. ఈ ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే వ్యవసాయ రంగం మెరుగుపడుతుందని వెల్లడించారు. క్షేత్రస్థాయిలో ఉన్న నీటి పారుదల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
త్వరలో పనుల ప్రారంభం
వొడితల ప్రణవ్ విజ్ఞప్తిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. సంబంధిత సాగునీటి పనులను త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రైతులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల పునరుద్ధరణ ద్వారా వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

