ఆర్టీసీ సమ్మెకు బీజేపీ పూర్తి మద్దతు
కరీంనగర్ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు
కాకతీయ, కరీంనగర్: ఆర్టీసీ కార్మికులు తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన సమ్మెకు భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు తెలిపారు.
గురువారం సమ్మె శిబిరాన్ని సందర్శించిన ఆయన, కార్మికులను కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యంపై ఆయన తీవ్రంగా విమర్శలు గుప్పించారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం బేషరతుగా వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
శాంతియుతంగా సమ్మె చేస్తున్న కార్మికులకు టెంట్ వేసుకునే అనుమతి కూడా ఇవ్వకపోవడం యాజమాన్యం మొండితనం, నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పూర్తిగా పరిష్కారం అయ్యేంత వరకు బీజేపీతో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కార్మికుల పక్షాన నిలుస్తారని భరోసా ఇచ్చారు.
సమ్మె శిబిరంలో కార్మికులు తమ సమస్యలను సునీల్ రావు దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా మహిళా కార్మికులు పని ఒత్తిడి తీవ్రంగా పెరిగిందని, కుటుంబ కార్యక్రమాలకు కూడా హాజరుకాలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
కార్మికుల ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమని, ఇప్పటికైనా మొండివైఖరి వీడి చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని సునీల్ రావు కోరారు.
ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

