మేఘ దగాపై విచారణేది..?!
కోట్ల మట్టి కొట్టుకుపోయిన నిర్మాణ సంస్థ
కౌకొండ గుట్టలను గుల్ల చేసి యథేచ్ఛగా మట్టి దోపిడీ
గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణానికి ప్రకృతిపై పడగ విప్పిన నిర్మాణ సంస్థ
అనుమతుల్లేకుండానే నెలన్నర రోజులుగా రేయిబవళ్లు మట్టి దొంగతనం
కాకతీయలో వరుస కథనాలతో వెలుగులోకి తీసుకురావడంతో పరార్
మేం ఒక్కరమే కాదు.. చాలా మంది తవ్వుతున్నారంటూ బుకాయింపు
చర్యలపై వివరణ అడిగితే మైనింగ్ ఏడీ రవి శంకర్ చిర్రు..బుర్రు..!
మ్యాన్ పవర్ లేదు.. విచారణ చేస్తాం.. చూస్తామంటూ నాన్చుడు ధోరణి
ఫిర్యాదు అందలేదు.. తెలుసుకుంటానంటూ పొంతనలేకుండా సమాధానాలు
వందలాది టిప్పర్లతో రవాణా జరిగిన సార్‌కు అసలు విషయమే తెల్వదంట
విస్తుగొల్పుతున్న హన్మకొండ జిల్లా యంత్రాంగం వైఖరి
లక్షల క్యూబిక్ మీటర్లు దోచుకెళ్లిన ప్రముఖ సంస్థపై ప్రేమెందుకు?
కౌకొండ గుట్టలను నాశనం చేసినా ఫర్వాలేదా..!
వాల్టా చట్టమెందుకు ప్రమోగించరు.. జరిమానాలతో రాయల్టీ ఎందుకు వసూలు చేయరు..?
నీతులు.. నిబంధనలు సామాన్యులకేనా..? కార్పోరేట్ సంస్థల ముందు మోకరిల్లుతారా..?

కాకతీయ, నిఘా : అభివృద్ధి ముసుగులో ప్రకృతి సంపదను కొల్లగొడుతూ, నిబంధనలను కాలరాస్తున్న మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ ఆగడాలు హన్మకొండ జిల్లాలో పరాకాష్టకు చేరాయి. గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి అవసరమైన మట్టి కోసం ఎటువంటి అనుమతులు లేకుండానే హన్మకొండ జిల్లా నడికూడ మండలం కౌకొండ గుట్టలను ఈ సంస్థ గుల్ల చేస్తోంది. నెలన్నర రోజులుగా రేయింబవళ్లు వందలాది టిప్పర్లతో మట్టిని తరలిస్తూ కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతోంది. ఈ అక్రమ దోపిడీపై ‘కాకతీయ’ దినపత్రిక వరుస కథనాలతో వెలుగులోకి తీసుకురావడంతో, ప్రస్తుతం సదరు సంస్థ ప్రతినిధులు అక్కడి నుంచి పలాయనం చిత్తగించింది. అయితే, ఇంతటి భారీ కుంభకోణం జరుగుతున్నా జిల్లా మైనింగ్ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ప్రకృతిపై పడగ.. మైనింగ్ అధికారుల తోడు
గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణంలో భాగంగా కౌకొండ ప్రాంతంలోని గుట్టలను మేఘా సంస్థ మట్టి క్వారీగా మార్చేసింది. నిబంధనల ప్రకారం మైనింగ్ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలి, రాయల్టీ చెల్లించాలి. కానీ ఈ కార్పొరేట్ సంస్థ అవేవీ పట్టించుకోకుండా లక్షలాది క్యూబిక్ మీటర్ల మట్టిని తరలించింది. ఈ విషయంపై మైనింగ్ ఏడీ రవి శంకర్‌ను వివరణ కోరగా ఆయన తీరు విస్మయానికి గురిచేస్తోంది. “మాకు ఫిర్యాదు అందలేదు, అసలు మట్టి తరలింపు విషయం మా దృష్టికే రాలేదు” అంటూ ఆయన బుకాయించడం గమనార్హం. వందలాది టిప్పర్లు రోజూ రోడ్లపై తిరుగుతుంటే మైనింగ్ శాఖకు తెలియకపోవడం అంటే, అది వైఫల్యమా లేక అక్రమార్కులతో కుమ్మక్కు కావడమా అని ప్రజలు నిలదీస్తున్నారు. వివరణ అడిగిన కాకతీయ ప్రతినిధిపై అధికారి చిర్రుబుర్రులాడుతూ మ్యాన్ పవర్ లేదంటూ సాకులు చెప్పడం ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.

కార్పొరేట్ సంస్థల ముందు నిబంధనల మోకరింపు
సామాన్యుడు తన ఇంటి అవసరాల కోసం ఒక ట్రాక్టర్ మట్టి తోలుకుంటే వాల్టా చట్టం పేరుతో వేల రూపాయల జరిమానాలు విధించే అధికారులు, మేఘా వంటి పెద్ద సంస్థల ముందు మోకరిల్లుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. “మేమొక్కరమే కాదు, చాలా మంది తవ్వుతున్నారు” అంటూ సదరు సంస్థ ప్రతినిధులు కాకతీయకు వెల్లడించడం గమనార్హం. ప్రకృతి సంపదను నాశనం చేస్తూ, ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన రాయల్టీని ఎగవేస్తున్నా హన్మకొండ జిల్లా యంత్రాంగం ఎందుకు మౌనం వహిస్తోంది? లక్షలాది క్యూబిక్ మీటర్ల దోపిడీపై ఎందుకు విచారణ జరిపించడం లేదు? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

చట్టం చుట్టమైతే ప్రకృతికే ముప్పు
పర్యావరణాన్ని కాపాడాల్సిన వాల్టా చట్టం ఇక్కడ అటకెక్కినట్లు కనిపిస్తోంది. గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం పచ్చని ప్రకృతిని నాశనం చేస్తున్నా.. నిబంధనలకు తిలోదకాలు ఇస్తూ, గుట్టలను పిండి చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేడనే విమర్శలు ఇప్పడు హన్మకొండ జిల్లా ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. అధికారులు ఇప్పటికైనా స్పందించి, అనుమతుల్లేకుండా మట్టి తరలించిన మేఘా సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అనుమతుల్లేకుండా సాగిన మట్టి దందాకు.. మైనింగ్ నిబంధనల ప్రకారం… పదిరెట్లతో జరిమానా విధిస్తూ.. రాయల్టీని సదరు సంస్థ నుంచి వసూలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ప్రకృతి సంపదను కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేసిన అధికారులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. నీతులు, నిబంధనలు కేవలం పేదలకేనా, కార్పొరేట్ దొంగలకు వర్తించవా అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని ఈ ‘మేఘ దగా’పై ఉన్నత స్థాయి విచారణ జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


