జనగణన శిక్షణ వేళలు మార్చాలి
ఎండల తీవ్రత దృష్ట్యా కలెక్టర్‌కు ‘తపస్’ వినతి
ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు నిర్వహించాలని విజ్ఞప్తి
తొలి విడత రాని వారికి రెండో విడతలో అవకాశం ఇవ్వాలి
కాకతీయ, కరీంనగర్ : జనగణన–2026-27 విధుల్లో భాగంగా ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లకు నిర్వహిస్తున్న శిక్షణ సమయాన్ని ప్రస్తుత ఎండల తీవ్రత దృష్ట్యా మార్చాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) జిల్లా శాఖ కోరింది. ఈ మేరకు బుధవారం జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాను కలిసి వినతిపత్రం సమర్పించారు. శిక్షణ వేళలను ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మార్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా తపస్ ప్రతినిధులు మాట్లాడుతూ.. జిల్లాలో ఎండలు విపరీతంగా పెరిగిపోయాయని, మధ్యాహ్న సమయంలో శిక్షణకు హాజరయ్యే ఉపాధ్యాయులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా శిక్షణ వేళలను సవరించాలని కోరారు. అలాగే వివిధ కారణాలతో తొలి విడత శిక్షణకు హాజరుకాలేకపోయిన వారు, ఎస్ఎస్సీ ఓపెన్ స్కూల్ పరీక్షల విధుల్లో ఉన్న ఉపాధ్యాయులకు తదుపరి విడతలో అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించి, వేళల మార్పు అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు సంఘం నాయకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా అధ్యక్షుడు అన్నమనేని తిరుపతిరావు, ప్రధాన కార్యదర్శి జారతి నర్సయ్య, రాష్ట్ర బాధ్యులు కే హరిచరణ్, సహాధ్యక్షుడు న్యాలమడుగు శ్రీధర్, మీడియా ఇంచార్జ్ బొద్దుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

