మొక్కజొన్న రైతులపై ప్రభుత్వం నిర్లక్ష్యం
మద్దతు ధర అమలులో స్పష్టత లేదు
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ధ్వజం
నెక్కొండ మార్కెట్ వద్ద బీఆర్ఎస్ నిరసన
కాకతీయ, నెక్కొండ: మొక్కజొన్న రైతుల సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు. నెక్కొండ వ్యవసాయ మార్కెట్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం వారిని రోడ్లపైకి నెట్టేసిందని మండిపడ్డారు. క్వింటాల్‌కు రూ. 2400 మద్దతు ధర ప్రకటించినా, క్షేత్రస్థాయిలో దాని అమలుపై స్పష్టత లేదని ఆరోపించారు.
ప్రణాళిక లేని కొనుగోళ్లు
రాష్ట్రంలో ఎంత దిగుబడి వస్తుంది, ఎంతమేర కొనుగోలు చేయాలనే కనీస ప్రణాళిక కూడా ప్రభుత్వానికి లేదని సుదర్శన్ రెడ్డి ఎద్దేవా చేశారు. మండలానికి ఒకే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటున్నారని, మంత్రులు మరియు ఎమ్మెల్యేలు కేవలం ఫొటోలకే పరిమితమయ్యారని విమర్శించారు. సేకరించిన పంటను ఎక్కడ నిల్వ చేయాలో తెలియని అయోమయ స్థితిలో అధికార యంత్రాంగం ఉందని పేర్కొన్నారు. రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించి, తగినన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సంగని సూరయ్య, కొమ్ము రమేష్ యాదవ్, గటిక అజయ్ కుమార్ మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

