ఇద్దరు సిబ్బంది సస్పెన్షన్
అవినీతి ఆరోపణలతో సూపరింటెండెంట్, అసిస్టెంట్‌పై చర్యలు
కాకతీయ, పెద్దపల్లి: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ (డీఎంహెచ్‌ఓ) కార్యాలయంలో అవినీతికి పాల్పడిన ఇద్దరు సిబ్బందిపై జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సస్పెన్షన్ వేటు వేశారు. జీతాల బిల్లుల ప్రక్రియను పూర్తి చేసేందుకు నగదు డిమాండ్ చేసినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సూపరింటెండెంట్ ఎం.డి. అజీమ్ ఖాన్, సీనియర్ సహాయకుడు ఓ. రామును తక్షణమే విధుల్లోంచి తొలగిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
జిల్లాలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కొత్తగా నియమితులైన ల్యాబ్ టెక్నీషియన్ల జీతాలను ఆర్థిక నిర్వహణ వ్యవస్థ లో నమోదు చేసేందుకు వీరు నగదు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులు అందాయి. ఈ అంశంపై ప్రాథమిక విచారణ చేపట్టిన అధికారులు.. జీతాల బిల్లుల సిద్ధీకరణలో అక్రమాలు జరిగినట్లు, అధికార దుర్వినియోగానికి పాల్పడి బాధితుల నుంచి వసూళ్లకు దిగినట్లు గుర్తించారు. విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో ఇద్దరిని సస్పెండ్ చేస్తూ శాఖాపరమైన చర్యలకు ఆదేశించారు. సస్పెన్షన్ కాలంలో అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్‌ను వీడరాదని కలెక్టర్ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా విడిచిపెట్టేది లేదని ఈ చర్య ద్వారా అధికారులు హెచ్చరించారు.

