రైతన్నను ఇబ్బంది పెట్టడం ప్రభుత్వానికి తగదు
కొనుగోలు కేంద్రాల సంఖ్యను తగ్గించడం సరికాదు
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
మక్కల కొనుగోలు కేంద్రాల వద్ద బీఆర్ఎస్ ధర్నా
కాకతీయ, దుగ్గొండి: అన్నదాతలను ఇబ్బందులకు గురిచేయడం ఏ ప్రభుత్వానికీ శ్రేయస్కరం కాదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. మక్కల రైతులకు మద్దతుగా దుగ్గొండి మండలం వెంకటాపురంలోని కొనుగోలు కేంద్రం వద్ద గురువారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గవ్యాప్తంగా 46 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు అండగా నిలిచామని పెద్ది గుర్తుచేశారు. కానీ, నేడు ఆ సంఖ్యను కేవలం ఆరు కేంద్రాలకే పరిమితం చేయడం సిగ్గుచేటని విమర్శించారు. రైతులు పండించిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయకపోవడం వల్ల వారు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచడంతో పాటు రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
పోరాటం ఉధృతం చేస్తాం..
రైతుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైతే బీఆర్ఎస్ తరఫున ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షుడు సుకినె రాజేశ్వర్ రావు, యూత్ కన్వీనర్ శానబోయిన రాజకుమార్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పొన్నం మొగిలి పాల్గొన్నారు. వీరితో పాటు సర్పంచులు కమలాకర్, రాజు, వెంకటేశ్వర్లు, ప్రశాంత్, మండల నాయకులు రాంబాబు, రవికుమార్, కుమారస్వామి, శ్రీనివాసరెడ్డి, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

