ఖమ్మంకు ‘కృష్ణ’ కటాక్షం..
ఇస్కాన్ ఆలయానికి కేబినెట్ ఆమోదం!
రఘునాథపాలెంలో సుమారు 5 ఎకరాల భూమి కేటాయింపు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రివర్గానికి తుమ్మల కృతజ్ఞతలు
ఖమ్మంలో ఆధ్యాత్మిక వైభవానికి నాంది
మంత్రి కృషితో రూపుదిద్దుకుంటున్న సమగ్ర సేవా–సాంస్కృతిక వేదిక
శ్రీకృష్ణ భక్తి మార్గంతో పాటు సామాజిక సేవలకు నిలయం
యువతకు యోగా, ధ్యానం.. విద్యార్థులకు భగవద్గీత బోధన
సహజ వ్యవసాయం, గో సంరక్షణే లక్ష్యంగా మహా ప్రాజెక్టు
కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఖమ్మం జిల్లా కేంద్రంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరియనుంది. ఇస్కాన్ సొసైటీ ఆధ్వర్యంలో బలరామకృష్ణ ఆలయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. రఘునాథపాలెం మండలం పరిధిలో సుమారు 4 ఎకరాల 30 గుంటల ప్రభుత్వ భూమిని ఇస్కాన్ సంస్థకు కేటాయిస్తూ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. రెవెన్యూ నిబంధనల ప్రకారం ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్ విలువ చెల్లింపుపై ఈ భూమిని కేటాయించనున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ పంపిన ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం, తుది అనుమతులు మంజూరు చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, సహచర మంత్రివర్గానికి తుమ్మల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఆధ్యాత్మిక–సేవా కేంద్రంగా ఇస్కాన్ ప్రాజెక్టు
ఖమ్మంలో నిర్మితమవుతున్న ఇస్కాన్ ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, ఇది భక్తి, విద్య, సేవ, గ్రామీణాభివృద్ధి అన్న నాలుగు స్తంభాలపై నిలబడే సమగ్ర ప్రాజెక్టు. వేద శిల్పకళా సౌందర్యంతో శ్రీ శ్రీ బలరామ–కృష్ణ ఆలయాన్ని నిర్మించనున్నారు. నగర జీవన ఒత్తిడిలో మానసిక ప్రశాంతత కోరుకునే వారికి ఇది ఆధ్యాత్మిక ఆశ్రయంగా మారనుంది. ఇక్కడ నిర్వహించే నిత్య పూజలు, ఉత్సవాలు భవిష్యత్తులో పర్యాటక రంగానికి కూడా ఊతమిచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత తరం ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి, వ్యసనాలకు యోగా, ధ్యానం, సాత్విక ఆహారం ద్వారా వేద పరిష్కార మార్గాలు చూపాలని ఇస్కాన్ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి ఆదివారం విద్యార్థుల కోసం భగవద్గీత తరగతులు, వేసవి శిబిరాలు నిర్వహించి నైతిక విలువలను పెంపొందించనున్నారు. వీటితో పాటు మహిళా సాధికారత, గిరిజన సంక్షేమం కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. నిత్య అన్నదాన సేవ ద్వారా ఆకలి నిర్మూలనకు ఈ కేంద్రం వేదిక కానుంది.
సహజ వ్యవసాయం.. గో సంరక్షణ
పర్యావరణ పరిరక్షణలో భాగంగా గోశాల ఏర్పాటు చేసి గో సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. రసాయనాలు లేని సహజ వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. గో-ఉత్పత్తులు, ఆర్గానిక్ వ్యవసాయాన్ని అనుసంధానం చేయడం ద్వారా రైతులకు ఆర్థిక స్వయం సమృద్ధిని చేకూర్చాలన్నది ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. అల్లీపురంలో ఇప్పటికే టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం సాగుతుండగా, ఇప్పుడు రఘునాథపాలెంలో ఇస్కాన్ ఆలయం కూడా తోడవడంతో ఖమ్మం జిల్లా రాష్ట్ర స్థాయిలోనే ప్రముఖ ఆధ్యాత్మిక–సేవా హబ్‌గా రూపాంతరం చెందనుంది.

