మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి
సర్పంచ్ గోగుల శ్రీనివాస్ రెడ్డి
మహ్మదాపురంలో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభం
కాకతీయ, దుగ్గొండి: గ్రామీణ ప్రాంత మహిళలు స్వయం ఉపాధి రంగాల్లో రాణించి ఆర్థికంగా నిలదొక్కుకోవాలని మహ్మదాపురం సర్పంచ్ గోగుల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మండలంలోని మహ్మదాపురం గ్రామంలో ఆయన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని గురువారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గ్రామ మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. నిరుద్యోగ మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. కుట్టు పనిలో శిక్షణ పొందడం ద్వారా మహిళలు తమ కాళ్లపై తాము నిలబడటమే కాకుండా, కుటుంబ ఆదాయాన్ని పెంచుకోవచ్చని సూచించారు. ఈ కేంద్రంలో మహిళలకు ఉచితంగా శిక్షణ ఇవ్వడంతో పాటు, దానికి అవసరమైన పరికరాలను కూడా సమకూర్చనున్నట్లు వెల్లడించారు. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలు సొంతంగా ఉపాధి పొందేలా తగిన సహాయ సహకారాలు అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ అవకాశాన్ని గ్రామంలోని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాలడుగుల శివ, జీవన్ మరియు గ్రామానికి చెందిన మహిళలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

