ముదిగొండలో అడ్డగోలుగా గ్రానైట్ రవాణా
రహదారులపై రాళ్ల వేస్టేజీ.. ప్రాణాపాయంలో వాహనదారులు
పట్టించుకోని అధికార యంత్రాంగం
కాకతీయ, ముదిగొండ: ముదిగొండ మండలంలో గ్రానైట్ రాళ్ల రవాణా నిబంధనలకు విరుద్ధంగా సాగుతోంది. పాతబడిన వాహనాల్లో భారీ రాళ్లను అడ్డగోలుగా తరలిస్తుండటంతో, అవి రహదారులపై పడి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. నిబంధనలను బేఖాతరు చేస్తూ సాగుతున్న ఈ రవాణా వల్ల ఒకవైపు విలువైన గ్రానైట్ వృథా అవుతుండగా, మరోవైపు సామాన్య ప్రజల ప్రాణాలు గాలిలో దీపాల్లా మారుతున్నాయి. రవాణా సమయంలో వాహనాల నుంచి జారి రోడ్డు మధ్యలో పడిపోతున్న రాళ్లు వాహనదారులకు శాపంగా మారాయి. ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఈ రాళ్లు కనిపించకపోవడంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. పలువురు ప్రయాణికులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యంపై నిరసన..
ఇంత జరుగుతున్నా మైనింగ్, రవాణా శాఖల అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి తనిఖీలు లేకుండా, ఫిట్‌నెస్ లేని వాహనాల్లో రాళ్లను తరలిస్తున్నా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, రహదారులపై పడిన రాళ్లను వెంటనే తొలగించాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

