ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు ఇంటర్వ్యూలు
20 యూనిట్లకు 121 మంది అభ్యర్థుల హాజరు
పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ : ఎంపీడీవో కృష్ణ ప్రసాద్
కాకతీయ, శంకరపట్నం: మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్ పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం శుక్రవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఎంపీడీవో గోల్కొండ కృష్ణ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి మరియు వివిధ బ్యాంకుల మేనేజర్లు పాల్గొని అభ్యర్థులను ఇంటర్వ్యూ చేశారు. మండలానికి కేటాయించిన 20 యూనిట్ల కోసం మొత్తం 148 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 121 మంది హాజరయ్యారు. ప్రభుత్వం అందిస్తున్న ఎలక్ట్రానిక్ టూ వీలర్లు, త్రీ వీలర్లు, పాడి పశువులు మరియు సోలార్ పంపుసెట్లు వంటి యూనిట్ల కోసం అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పోటీపడ్డారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇంటర్వ్యూల ద్వారా ఎంపికైన అర్హులైన లబ్ధిదారుల జాబితాను తుది ఆమోదం కోసం జిల్లా కలెక్టర్‌కు పంపించనున్నట్లు వెల్లడించారు. ఈ ఎంపిక ప్రక్రియలో యూనియన్ బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్, కేడీసీసీ మరియు ఇండియన్ బ్యాంక్ మేనేజర్లు పాల్గొని అభ్యర్థుల ఆర్థిక స్థితిగతులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కె. వెంకటేష్, పశు వైద్యాధికారి మాధవరావు మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

