హక్కుల కమిషన్ వద్ద ‘ఆత్మహత్య’ డ్రామా
కట్ చేస్తే భారీ దొంగతనం వెలుగులోకి
పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు
పనిచేసే ఇంట్లో 7 తులాల బంగారం మాయం
దొంగతనం బయటపడుతుందనే భయంతో పిల్లలతో కలిసి హైడ్రామా
నిందితురాలితో పాటు భర్త అరెస్ట్.. నిందితుల నుంచి బంగారం స్వాధీనం
కాకతీయ,తెలంగాణ బ్యూరో : పోలీసులు వేధిస్తున్నారంటూ మానవ హక్కుల కమిషన్ కార్యాలయం ముందు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో అనూహ్య మలుపు వెలుగుచూసింది. దొంగతనం కేసు నుంచి తప్పించుకోవడానికే సదరు మహిళా నిందితురాలు ఆత్మహత్య డ్రామా ఆడినట్లు పోలీసులు ఆధారాలతో సహా నిరూపించారు. కవాడిగూడకు చెందిన శ్రీవాణి అనే మహిళ ఇటీవల నాంపల్లిలోని మానవ హక్కుల కమిషన్ ఎదుట తన పిల్లలతో కలిసి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. తాను పని చేస్తున్న ఇంట్లో బంగారం పోతే.. యజమాని ఫిర్యాదు మేరకు గాంధీనగర్ పోలీసులు తనను, తన భర్త చంద్రకాంత్‌ను వేధిస్తున్నారని ఆమె ఆరోపించింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన కమిషన్.. దీనిపై సమగ్ర విచారణ జరపాలని పోలీసులను ఆదేశించింది. కమిషన్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు శ్రీవాణి దంపతులపై రహస్యంగా నిఘా పెట్టారు. సత్వ మాల్ సమీపంలోని నెక్లెస్ ప్రైడ్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉండే అరోరా అనే మహిళ ఇంట్లో ఏడు తులాల బంగారం పోయిందని, పనిమనిషి శ్రీవాణిపై అనుమానం ఉందని బాధితురాలు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా శ్రీవాణి భర్త చంద్రకాంత్ కదలికలను గమనించగా అసలు విషయం బయటపడింది.
బంగారం షాపులో అమ్మకాలు..
నిందితులు శ్రీవాణి, చంద్రకాంత్ దంపతులు చోరీ చేసిన ఏడు తులాల బంగారాన్ని దశలవారీగా దోమలగూడలోని ఒక బంగారు దుకాణంలో విక్రయిస్తున్నట్లు పోలీసులు పక్కా ఆధారాలు సేకరించారు. పోలీసులు విచారణకు పిలిచిన సమయంలో దొంగతనం బయటపడుతుందనే భయంతోనే.. పోలీసుల మీద ఒత్తిడి తీసుకురావడానికి శ్రీవాణి ఆత్మహత్యాయత్నం డ్రామా ఆడినట్లు నిర్ధారించారు. నిందితులు శ్రీవాణి, చంద్రకాంత్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా వారు నేరాన్ని అంగీకరించారు. వారి నుంచి చోరీకి గురైన ఏడు తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన పోలీసు అధికారులను ఉన్నతాధికారులు అభినందించారు.

