కలెక్టర్ దివాకర్ బదిలీపై పునరాలోచించాలి
గిరిజనాభివృద్ధికి విఘాతం కలగకుండా చూడాలి
ఆదివాసీ హక్కుల పోరాట సమితి ‘తుడుం దెబ్బ’ డిమాండ్
కాకతీయ, ఏటూరునాగారం : ములుగు జిల్లా కలెక్టర్ టీఎస్.దివాకర్ గారిని బదిలీ చేయడంపై గిరిజన సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జిల్లాలోని గిరిజన ప్రాంతాల అభివృద్ధికి నిబద్ధతతో పనిచేస్తున్న అధికారిని మార్చడం వల్ల జరుగుతున్న ప్రగతికి అంతరాయం కలుగుతుందని ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ) మండల అధ్యక్షుడు తాటి నీలాద్రి పేర్కొన్నారు. శనివారం ఏటూరునాగారం మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గిరిజన సమస్యలపై స్పష్టమైన అవగాహన కలిగి, వాటి పరిష్కారానికి చురుకైన చర్యలు తీసుకుంటున్న కలెక్టర్ బదిలీ తగదని నీలాద్రి అభిప్రాయపడ్డారు. “ముఖ్యంగా అధికారులకు గిరిజన చట్టాలపై అవగాహన కల్పిస్తూ, హక్కుల పరిరక్షణలో కలెక్టర్ గారు కీలక పాత్ర పోషించారు. దీనివల్ల పరిపాలనలో పారదర్శకత పెరిగి, ఆదివాసీలకు న్యాయం జరుగుతున్న భావన కలిగింది” అని ఆయన గుర్తుచేశారు.
ప్రణాళికలు కుంటుపడే ప్రమాదం
అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, ఇలాంటి సమయంలో నాయకత్వం వహిస్తున్న అధికారులను మార్చడం వల్ల కీలకమైన పథకాలు, ప్రణాళికలు మధ్యలోనే నిలిచిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ బదిలీ నిర్ణయంపై పునర్విమర్శ చేయాలని తుడుం దెబ్బ మండల కమిటీ తరఫున డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి వట్టం జనార్దన్, జిల్లా ఉపాధ్యక్షుడు ఎట్టి రాజబాబు, సహాయ కార్యదర్శి వట్టం సురేష్, కోశాధికారి సోలం సురేష్, మండల ప్రధాన కార్యదర్శి ఈసం పణికుమార్, మరియు నాయకులు కోరం సుధాకర్, గావిడి నాగబాబు, పిట్టల నాగేష్, బొగ్గం శివకుమార్, పలక నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.

