ఉద్యమకారులకు సముచిత గుర్తింపునివ్వాలి
ఎమ్మెల్సీ కోదండరాంకు టీజేఎస్ నేతల విన్నపం
ఉచిత విద్య, వైద్యంపై చర్చ
కాకతీయ, నర్సంపేట టౌన్: తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారులకు ప్రభుత్వం తగిన గుర్తింపు, గౌరవం కల్పించాలని తెలంగాణ జన సమితి (టీజేఎస్) నాయకులు కోరారు. ఆదివారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంను నేతలు మర్యాదపూర్వకంగా కలిసి పలు కీలక అంశాలపై చర్చించారు. ఉద్యమకారుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఈ సందర్భంగా విన్నవించారు. ఉద్యమ సమయంలో అమరులైన వారి కుటుంబాలను ఆదుకోవడంతో పాటు, పోరాటంలో చురుకుగా పాల్గొన్న వారికి సముచిత స్థానం కల్పించాల్సిన అవసరం ఉందని నేతలు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఉద్యమకారుల పిల్లలకు ఉచిత విద్య, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన ఉచిత వైద్య సేవలు అందించాలని కోరారు. వీరికి ఉద్యోగాల్లోనూ తగిన ప్రాధాన్యత కల్పించేలా ప్రభుత్వంతో మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు. కేవలం ఉద్యమకారుల సమస్యలే కాకుండా, క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను కూడా సమగ్రంగా సేకరించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని ఈ భేటీలో నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి శ్రీనివాస్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు షేక్ జావీద్, రాష్ట్ర కమిటీ సభ్యుడు భోనగాని రవీందర్, నాయకుడు సిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

