ఏజెన్సీ గ్రామాల్లో ఎస్పీ సుధీర్ పర్యటన
కర్రె గుట్టల ప్రాంతంలో రహదారి పనుల పరిశీలన
నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశం
కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్ ఆదివారం పోలీస్ అధికారులతో కలిసి వెంకటాపురం మండల పరిధిలోని ఏజెన్సీ గ్రామాల్లో పర్యటించారు. కర్రె గుట్టల ప్రాంతంలోని జల్ల, డోలీ గ్రామాలను సందర్శించిన ఆయన.. మురుమూరు నుంచి తాడపాల వరకు సాగుతున్న రహదారి నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రహదారి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, ఎక్కడా నాణ్యతా ప్రమాణాల్లో రాజీ పడకూడదని సంబంధిత కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. రహదారి నిర్మాణ ప్రాంతాల్లో రాత్రింబవళ్లు భద్రతా విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందితో ఎస్పీ ప్రత్యేకంగా మాట్లాడారు. మారుమూల ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి అవసరమైన అన్ని రకాల వసతులు, సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు అభివృద్ధి పనులకు ఆటంకం కలగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ పర్యటనలో ములుగు డీఎస్పీ రవీందర్, ఎస్బీ ఇన్‌స్పెక్టర్ శంకర్, వెంకటాపురం సీఐ రమేష్‌తో పాటు సివిల్, సీఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

