అమరుల స్ఫూర్తితో ఉద్యమాలకు ఊపిరి
ఘనంగా సంస్మరణ వారోత్సవాలు
బూర్గుపల్లి లక్ష్మయ్య, మంగిశెట్టి సాయిలు స్థూపాల వద్ద నివాళి
కాకతీయ, నెక్కొండ: అమరుల ఆశయాల సాధనే లక్ష్యంగా ప్రజా ఉద్యమాలు నిర్మించాలని ఎంసీపీఐ(యు) నర్సంపేట డివిజన్ కార్యదర్శి మహమ్మద్ రాజాసాహెబ్ పిలుపునిచ్చారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఏప్రిల్ 24 నుంచి మే 1 వరకు నిర్వహిస్తున్న అమరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం నెక్కొండ మండల కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. మండల కార్యదర్శి గాజుల వెంకటయ్య అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో భాగంగా.. నెక్కొండలోని అమరజీవి బూర్గుపల్లి లక్ష్మయ్య, అలంకాని పేటలోని మంగిశెట్టి సాయిలు స్థూపాల వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజాసాహెబ్ మాట్లాడుతూ.. ఆర్థిక అసమానతలు లేని సమసమాజ స్థాపన కోసం అమరులు తమ ప్రాణాలను త్యాగం చేశారని పేర్కొన్నారు. “గతంలో ప్రజా ఉద్యమాలను అణచివేసేందుకు పెట్టుబడిదారీ వర్గాలు ఎన్ని కుట్రలు చేసినా, పోలీసు నిర్బంధాలను ఎదుర్కొని ఉద్యమ జెండాను నిలబెట్టిన ఘనత మన అమరులది” అని కొనియాడారు. వారి త్యాగాల నుంచి స్ఫూర్తి పొంది కార్యకర్తలు ప్రజా సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఉద్యమకారుల త్యాగాలను స్మరించుకుంటూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏఐకేఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఇస్మాయిల్, మండల సహాయ కార్యదర్శి మహమ్మద్ అలీ సాహెబ్, డాక్టర్ ఘటికే కోటేశ్వర్, మాజీ సర్పంచ్ మాదాసు రవి, సొల్లేటి సీతారాములు, రామ్ బ్రహ్మం, మంగిశెట్టి శ్రీను, ఉప్పలయ్య, కందుల అనిల్ మరియు అమరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

