ప్రతిపక్షాలవి శవ రాజకీయాలు!
డంపింగ్ యార్డ్ ప్రతిపాదన గత ప్రభుత్వానిదే
వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్, డంపింగ్ యార్డుకు తేడా తెలుసుకోండి
కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్
హుజూరాబాద్‌లో 181 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
కాకతీయ, హుజూరాబాద్ : హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల ఆరోగ్యమే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రధానమని, రాజకీయ లబ్ధి కోసం బీఆర్ఎస్, బీజేపీలు కుటిల రాజకీయాలు చేస్తున్నాయని కాంగ్రెస్ ఇంచార్జి వొడితల ప్రణవ్ మండిపడ్డారు. సోమవారం హుజూరాబాద్ పట్టణంలోని సిటీ సెంట్రల్ హాల్లో నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలు, రెండు పట్టణాలకు చెందిన 181 మంది లబ్ధిదారులకు రూ. 58.44 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ.. హుజూరాబాద్‌లో డంపింగ్ యార్డ్ పెడతామని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ అంటే ఏమిటో తెలియకుండా కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడటం విచారకరమన్నారు. “కరీంనగర్ డంపింగ్ యార్డ్ వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోని బండి సంజయ్.. ఇక్కడ రాజకీయాలు చేయడం విడ్డూరంగా ఉంది. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్, డంపింగ్ యార్డుకు ఉన్న తేడా తెలుసుకోవాలి” అని హితవు పలికారు.
ఉనికి కోసమే కౌశిక్ రెడ్డి ఆరాటం
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఈ ప్లాంట్ ప్రతిపాదన వచ్చిందని, అప్పుడు నోరు మెదపని నాయకులు ఇప్పుడు ప్రజలను రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. “ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన ఉనికిని కాపాడుకోవడానికే కొత్త నాటకాలాడుతున్నారు. చస్తా.. గీస్తా అని శవ రాజకీయాలు చేయడం తప్ప ప్రజల బాగోగులు ఆయనకు పట్టవు” అని దుయ్యబట్టారు. ప్లాంట్‌ను వేరే చోటుకు తరలించాలని ఇప్పటికే మున్సిపల్ పాలకపక్షం తీర్మానం చేసిందని, తాము కూడా మంత్రులు, అధికారులను కలిసి విన్నవించామని గుర్తు చేశారు.
ప్రజలకు హాని చేసే పని చేయం
కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజలకు హాని చేసే నిర్ణయాలు తీసుకోదని ప్రణవ్ పునరుద్ఘాటించారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు కష్టకాలంలో అండగా నిలిచిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ మున్సిపల్ చైర్మన్ గందె సుహాసిని, జమ్మికుంట మున్సిపల్ ప్రజాప్రతినిధులు, మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, సర్పంచులు, వార్డు సభ్యులు మరియు పార్టీ సీనియర్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

