డ్రగ్స్‌కు దూరంగా ఉండండి
ప్రభుత్వం అండగా ఉంటుంది
మంచి లక్ష్యం, లక్షణాలతో ఎదగాలి
రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క
బాలబాలికలకు స్పోర్ట్స్ కిట్స్, ధ్రువపత్రాలు అందజేత
కాకతీయ, తెలంగాణ బ్యూరో: బాల, బాలికలు డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా ఈనెల 27 నుండి మే 2 వరకు బాలల భద్రత, రక్షణ, మత్తు పదార్థాలకు నో చెప్పండి వారోత్సవాలను ప్రారంభించి బాల, బాలికలకు స్పోర్ట్స్ కిట్స్, ముఖ్యమైన ధ్రువపత్రాలను అందజేశారు. సోమవారం ప్రజా భవన్ లో మహిళా శిశు సంక్షేమ శాఖ, ఈగల్ ఫోర్స్, పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ, వయోవృద్ధుల శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలతో కలిసి మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాల బాలికలు మానసిక ధైర్యంతో ముందుకు సాగుతూ మంచి లక్ష్యంతో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు.
వ్యసనాలకు దూరంగా ఉండాలి
ఎస్సీపీఆర్ చైర్‌పర్సన్ సీత దయాకర్ రెడ్డి మాట్లాడుతూ… బాల, బాలికలు డ్రగ్స్ కు దూరంగా ఉండి డ్రగ్స్ వల్ల జరిగే నష్టాలు తోటి వారికి వివరించాలని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మంచి లక్ష్యంతో చదువుకొని ఎదగాలని, మానసికంగా ధైర్యంగా ఉంటూ ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని ఆమె సూచించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రెటరీ అనితా రామచంద్రన్ మాట్లాడుతూ… ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని అలాగే మహిళా శిశు సంక్షేమ శాఖ, ఈగల్ ఫోర్స్ అలాగే పోలీస్ శాఖ మూడు బృందాల ఆధ్వర్యంలో వారం రోజులపాటు బాలల భద్రత, రక్షణ, మత్తు పదార్థాలకు నో చెప్పండి అని వారోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. అన్ని జిల్లాల్లో కూడా స్పోర్ట్స్ కిట్స్ అలాగే పలు రకాల ధ్రువపత్రాలు అందించనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో భాగంగా నవజాత శిశువు సంరక్షణ పోస్టర్, బంధుత్వ దత్తత ప్రక్రియ కరపత్రాన్ని ఆవిష్కరించారు.

