అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు ఇవ్వాలి
మీడియా కమిటీ సభ్యులతో కలెక్టర్ గరిమ అగర్వాల్
నిబంధనల ప్రకారం ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశం
కాకతీయ, సిరిసిల్ల టౌన్: జిల్లాలోని అర్హులైన జర్నలిస్టులందరికీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆదేశించారు. సోమవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నూతనంగా ఎన్నికైన జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సభ్యులకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అక్రిడిటేషన్ల జారీ ప్రక్రియలో ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 252కు అనుగుణంగా నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీడియా పాత్ర కీలకమని ఆమె పేర్కొన్నారు. అక్రిడిటేషన్ ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలని, ఎప్పటికప్పుడు కమిటీ సభ్యులతో సంప్రదింపులు జరుపుతూ పారదర్శకంగా ముందుకు వెళ్లాలని అధికారులను ఆదేశించారు. అనంతరం అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు కలెక్టర్ గరిమ అగర్వాల్‌ను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, డీపీఆర్ఓ ఏడుకొండలు, సీపీఓ శ్రీనివాసాచారి పాల్గొన్నారు. కమిటీ సభ్యులు దండి సంతోష్ కుమార్, సయ్యద్ లాయక్ పాషా, హింగే శ్రీనివాస్, టీవీ నారాయణ, సయ్యద్ ఆసిఫ్ అలీ సదత్, దాసరి దేవేందర్, కాంబోజు ముత్తయ్య, ఏదుల తిరుపతి, మ్యాన శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.

