రేడియల్ రోడ్ టెండర్లలో అక్రమాలు
రోడ్–2 ప్రాజెక్టులో ఆర్థిక అవకతవకలు జరిగాయి
బినామీలకు కాంట్రాక్టర్లకు దక్కడంపై విచారణ జరపాలి
ఈడీకి మాజీ ఏపీసీసీ అధ్యక్షుడు బక్కా జడ్సన్ ఫిర్యాదు
రూ.3,296 కోట్ల పనులపై అనేక ప్రశ్నలు లేవనెత్తిన నాయకుడు
కాకతీయ,తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ రేడియల్ రోడ్–2 గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టులో ఆర్థిక అవకతవకలు, టెండర్ల మూల్యాంకనంలో అక్రమాలు, బినామీ ఏర్పాట్లు జరిగాయనే ఆరోపణలపై దర్యాప్తు చేయాలని కోరుతూ మాజీ ఏపీసీసీ అధ్యక్షుడు, ఏఐసీసీ మాజీ సభ్యుడు బక్కా జడ్సన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. సుమారు రూ.3,296 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రభుత్వ రికార్డులు, టెండర్ పత్రాలు, బ్యాంకు, ఆర్థిక లావాదేవీల వివరాలను స్వతంత్రంగా పరిశీలించాలని కోరారు. ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఈ ఫిర్యాదు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. రేడియల్ రోడ్–2 ప్రాజెక్టు సుమారు 81.15 కిలోమీటర్ల మేర నిర్మించాల్సిన గ్రీన్‌ఫీల్డ్ రహదారి. బుద్వేల్/కొత్వాల్‌గూడ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్ నుంచి కొడంగల్/నాచారం వైపు జాతీయ రహదారి–167ఎన్ సమీపం వరకు ఈ రహదారిని నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టును మూడు ప్యాకేజీలుగా విభజించినట్లు తెలిపారు.
రూ.3,296 కోట్లతో పనులు
మొదటి ప్యాకేజీ అంచనా వ్యయం రూ.1,237.16 కోట్లు, రెండో ప్యాకేజీ రూ.1,024.56 కోట్లు, మూడో ప్యాకేజీ రూ.1,034.47 కోట్లుగా పేర్కొన్నారు. ఈ మూడు ప్యాకేజీల మొత్తం అంచనా వ్యయం సుమారు రూ.3,296 కోట్లుగా ఉన్నట్లు తెలిపారు. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ద్వారా టెండర్లు ఆహ్వానించినట్లు, ఈ సంస్థ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే టెండర్ల పరిశీలన, మూల్యాంకనం, కాంట్రాక్టుల కేటాయింపు ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. టెండర్లకు సంబంధించిన అసలు పత్రాలు, ప్రభుత్వ రికార్డులను పరిశీలించి ఆరోపణల్లో వాస్తవాలను నిర్ధారించాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌ను ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ప్రాజెక్టులో బినామీ లేదా ప్రాక్సీ ఏర్పాట్లు ఉన్నాయనే అనుమానాలను వ్యక్తం చేశారు. సంబంధిత వ్యక్తుల ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు రికార్డులు, ప్రకటనలను పరిశీలించి వాస్తవాలను నిర్ధారించాలని కోరారు. ప్రభుత్వ రికార్డులు, టెండర్ పత్రాలు, బ్యాంకు, ఆర్థిక లావాదేవీల వివరాల ఆధారంగా ఆరోపణలను స్వతంత్రంగా ధ్రువీకరించాలని బక్కా జడ్సన్ కోరారు.

