లేబర్ కోడ్లను రద్దు చేయాలి
మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలి
సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గడ్డం రమేష్
నర్సంపేటలో మేడే సన్నాహక సమావేశం
కాకతీయ, నర్సంపేట టౌన్ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని, మున్సిపల్ కార్మికులకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గడ్డం రమేష్ డిమాండ్ చేశారు. నర్సంపేట మున్సిపాలిటీ కార్మికుల ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన మేడే సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దశాబ్దాల పోరాటాల ద్వారా కార్మికులు సాధించుకున్న హక్కులను కేంద్రం లేబర్ కోడ్ల రూపంలో నిర్వీర్యం చేస్తోందని రమేష్ ఆరోపించారు. ఈ కోడ్లు కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాసేలా ఉన్నాయని, వీటివల్ల దేశ కార్మిక వర్గం చౌక శ్రామిక శక్తిగా మారుతోందని విమర్శించారు. దేశ సంపద కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమవుతూ ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, పారిశుద్ధ్య తదితర విభాగాల కార్మికులకు కనీస వేతనాలు అందడం లేదని, పని భద్రత కరువైందని ఆయన పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశించినా ‘సమాన పనికి సమాన వేతనం’ అమలు కావడం లేదని మండిపడ్డారు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ కార్మికులకు రూ. 21,000 వేతనం ఇస్తుంటే, తెలంగాణలో మాత్రం ఆ ఊసే లేదని ధ్వజమెత్తారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడాలని, రాబోయే మేడే వేడుకలను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 10వ వార్డు కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కోరబోయిన కుమారస్వామి, నాయకులు గడ్డమీది బాలకృష్ణ మరియు పెద్ద సంఖ్యలో మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.

