తొర్రూర్ శివారులో దారుణం
*ఇద్దరు చిన్నారులను ఉరి వేసి తండ్రి ఆత్మహత్య
కాకతీయ, పెద్దవంగర /తొర్రూరు :మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణ శివారులో సోమవారం రాత్రి హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా తీవ్ర మనస్థాపానికి గురైన ఓ వ్యక్తి తన ఇద్దరు చిన్నారులను ఉరివేసి, అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అమపురం గ్రామానికి చెందిన కిన్నెర గుంశావలి(35) అనే వ్యక్తి కుటుంబ సమస్యలతో తీవ్ర మానసిక ఆవేదనకు గురైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తొర్రూర్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ఎదురుగా ఉన్న కాలీఫ్లవర్ పొలంలోని వేప చెట్టుకు ముందుగా తన ఇద్దరు కొడుకులకు ఉరివేసి, అనంతరం తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే తొర్రూర్ సీఐ గణేష్, ఎస్సై ఉపేందర్ సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అక్కడ ముగ్గురు వేప చెట్టుకు ఉరివేసుకున్న స్థితిలో కనిపించడంతో మృతదేహాలను కిందికి దించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ కలహాలే ఈ దారుణ ఘటనకు కారణమై ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో తొర్రూరు ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది. ఈ ఘటన గూర్చి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

