వేసవిలో నీటి ఎద్దడి రాకుండా చూడాలి
గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి
అధికారులతో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సమీక్ష
కాకతీయ, గీసుగొండ: వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖల పనితీరు, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యే రేవూరి మాట్లాడుతూ.. గ్రామాల్లో మంచినీరు, విద్యుత్, డ్రైనేజీ వంటి ప్రాథమిక అవసరాల్లో ఎక్కడా లోపాలు ఉండకూడదని స్పష్టం చేశారు. ముఖ్యంగా మిషన్ భగీరథ నీరు, రా వాటర్ కలిసిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, నీటి వృథాను అరికట్టేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, పథకాల అమలులో జాప్యం జరగకుండా చూడాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు సంఖ్యను పెంచేందుకు కృషి చేయాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుతున్న మెరుగైన వైద్య సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే కోరారు. అలాగే అసాంఘిక కార్యకలాపాలైన గుడుంబా, గంజాయి నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. రేషన్ బియ్యం సరఫరా సక్రమంగా జరిగేలా పర్యవేక్షించాలని సూచించారు. కార్యక్రమంలో డీపీఓ కటకం కల్పన, తహసీల్దార్ ఎండీ రియాజుద్దీన్, ఎంపీడీఓ వి. కృష్ణవేణి, ఎంపీఓ పాక శ్రీనివాస్, ఎంఈఓ రవీందర్, మిషన్ భగీరథ అధికారులు మరియు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

