జర్నలిస్టుల పేరుతో వసూళ్లకు పాల్పడితే చర్యలు
యూనియన్ల పేరిట విడదీయడం హేయమైన చర్య
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘాల హెచ్చరిక
కాకతీయ, ములుగు: జర్నలిస్టు సంఘాల పేరుతో వసూళ్లకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, అటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవని ములుగు జిల్లా వర్కింగ్ జర్నలిస్ట్ సంఘాల నాయకులు హెచ్చరించారు. ఈ మేరకు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ జిల్లా అధ్యక్షుడు ఎం.డి. షఫీ అహ్మద్, ఫెడరేషన్ జాతీయ కార్యవర్గ సభ్యుడు పిట్టల మధుసూదన్, జిల్లా కన్వీనర్ దూడబోయిన రాకేష్ మంగళవారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం ట్రేడ్ యూనియన్లు, ప్రెస్ క్లబ్‌లకే చట్టబద్ధత ఉందని వారు స్పష్టం చేశారు. కొందరు వ్యక్తిగత హోదాలు, పదవుల కోసం ‘జేఏసీ’ల పేరుతో జర్నలిస్టుల మధ్య చీలికలు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారని, ఇది హేయమైన చర్య అని ఖండించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా యూనియన్లతో సంబంధం లేకుండా జేఏసీలను ఏర్పాటు చేయడం హాస్యాస్పదమని పేర్కొన్నారు.
ములుగు జిల్లాలోని గుర్తింపు పొందిన యూనియన్లన్నీ వేర్వేరు వేదికలపై గళం వినిపిస్తున్నప్పటికీ, జర్నలిస్టుల సంక్షేమం కోసం ఒకే లక్ష్యంతో పనిచేస్తున్నాయని తెలిపారు. గుర్తింపు లేని సంఘాల పేరుతో విడిపోయి సమాజంలో చులకన కావద్దని, సమిష్టిగా ఉంటేనే బలం ఉంటుందని సూచించారు. జర్నలిస్టుల ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నాలను మానుకోవాలని, అక్రమ వసూళ్లకు పాల్పడితే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వారు హెచ్చరించారు.

