దివ్యాంగుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
కుడా చైర్మన్, హన్మకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల
ఘనంగా సహాయ ఉపకరణాల పంపిణీ
ఆధునిక స్కూటర్లు, ల్యాప్‌టాప్‌ల అందజేత
కాకతీయ, హనుమకొండ: దివ్యాంగుల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని కుడా చైర్మన్, హన్మకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రాంరెడ్డి అన్నారు. మంగళవారం హనుమకొండ కలెక్టరేట్‌లో తెలంగాణ వికలాంగుల కో-ఆపరేటివ్ కార్పొరేషన్ మరియు మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దివ్యాంగుల రవాణా సౌలభ్యం కోసం అత్యాధునిక స్కూటర్లు, బ్యాటరీ ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. అలాగే దివ్యాంగ విద్యార్థులు, యువత ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకోవడానికి ల్యాప్‌టాప్‌లను అందజేశారు. ఈ సందర్భంగా ఇనుగాల మాట్లాడుతూ దివ్యాంగులు ఎవరిపైనా ఆధారపడకుండా ఆత్మగౌరవంతో జీవించాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష అని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ నాణ్యమైన ఉపకరణాలు అందేలా చూస్తామని, భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాలను దివ్యాంగులకు చేరువ చేస్తామని భరోసా ఇచ్చారు. తమకు అండగా నిలుస్తున్న ప్రభుత్వంపై దివ్యాంగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సంబంధిత శాఖల సిబ్బంది మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.

