మేడే స్ఫూర్తితో పోరాటాలే మార్గం
పెట్టుబడిదారీ విధానాలపై పోరాడాలి
కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్య ఉద్యమం
ఎంసీపీఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ పిలుపు
కాకతీయ, నర్సంపేట టౌన్ : దోపిడీ రహిత సమాజ నిర్మాణం, ప్రపంచ శాంతి సాధన కోసం పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా ఎర్రజెండా పోరాటాలను మరింత ఉధృతం చేయాలని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ పిలుపునిచ్చారు. ప్రపంచ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఓంకార్ భవన్‌లో ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నగర కార్యదర్శి మాలోతు సాగర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికులు అలుపెరుగని పోరాటాలతో సాధించుకున్న హక్కులను పాలక వర్గాలు కాలరాస్తున్నాయని రమేష్ విమర్శించారు. శ్రామికుల ప్రయోజనాల కంటే పెట్టుబడిదారుల లాభాలకే ప్రాధాన్యమిస్తూ చట్టాలను సవరిస్తున్నారని ఆరోపించారు. ఎనిమిది గంటల పని విధానాన్ని 12 గంటలకు పెంచే ప్రయత్నాలను అడ్డుకోవాలని కోరారు. మరోవైపు సామాన్యులపై నిత్యావసరాల ధరల భారం మోపుతూ, గ్యాస్, పెట్రోల్ ధరలతో కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
రైతు, కూలీల సమస్యలపై డిమాండ్..
ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ కూలీలకు ఉపాధి లేకుండా చేస్తున్నారని, రైతులకు గిట్టుబాటు ధర దక్కకుండా మార్కెట్ దోపిడీని పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలకు మద్దతు ధర కల్పించాలని, రుణ విముక్తి చట్టం తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. పాత కార్మిక చట్టాలను యథావిధిగా అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సింగతి సాంబయ్య, గోనె కుమారస్వామి, నర్ర ప్రతాప్, కుసుంబా బాబురావు, ముక్కెర రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

