వీధి వ్యాపారులకు ‘జనతా ట్రస్ట్’ భరోసా
నేక్ సహకారంతో ఉపకరణాల పంపిణీ
తొలి విడతలో నాలుగు కుటుంబాలకు లబ్ధి
కాకతీయ, నర్సంపేట టౌన్ : చిరు వ్యాపారుల జీవనోపాధిని బలోపేతం చేసే దిశగా జనతా ట్రస్ట్ ముందడుగు వేసింది. జాతీయ గుడ్ల సమన్వయ కమిటీ హకారంతో పట్టణంలోని వీధి వ్యాపారులకు అవసరమైన వ్యాపార ఉపకరణాలను శుక్రవారం పంపిణీ చేసింది. గుడ్లు, అల్పాహార పదార్థాల విక్రయంతో జీవనం సాగించే నిరుపేద కుటుంబాలకు తోపుడు బండ్లు, గొడుగులు, వంట గ్యాస్ పొయ్యిలు, పాత్రలను అందజేశారు. ఈ సందర్భంగా జనతా ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. స్థానిక ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న వీధి వ్యాపారులకు అండగా నిలవడమే తమ లక్ష్యమని తెలిపారు. నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 200కు పైగా నిరుపేద కుటుంబాలకు గుడ్ల విక్రయ బండ్లు అందించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడించారు. నెక్ ప్రతినిధి కొర్ర రాజీవ్ మాట్లాడుతూ.. అటు రైతులకు, ఇటు చిన్న వ్యాపారులకు మేలు జరిగేలా మార్కెట్ అవకాశాలను కల్పిస్తున్నామని చెప్పారు. ట్రస్ట్ అందించిన ఈ సహకారం తమ కుటుంబ పోషణకు ఎంతో దోహదపడుతుందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దొడ్డ రవీందర్, బాదం రంజిత్, గండు నవీన్, కట్ల రామచందర్ రెడ్డి, జుర్రు రాజు, మాజీ ఎంపీపీ రాజు, గూడూరు సందీప్ తదితరులు పాల్గొన్నారు.

