వైభవంగా లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణం
వైశాఖ పౌర్ణమి వేళ భక్తిజన సందోహం
ఆధ్యాత్మిక తరంగంలో పానికర గ్రామం
కాకతీయ , నెక్కొండ : మండలంలోని పానికర గ్రామంలో వెలసిన ప్రాచీన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో వైశాఖ పౌర్ణమి వేడుకలు అంబరాన్నంటాయి. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ క్షేత్రంలో స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకను వీక్షించేందుకు పరిసర గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలిరావడంతో పానికర గుట్ట భక్తజన సందోహంగా మారింది. వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ అర్చకులు స్వామివారి దివ్య కల్యాణాన్ని జరిపించారు. సాయంత్రం వేళ గ్రామస్తులు సంప్రదాయబద్ధంగా ఎడ్ల బండ్లతో గుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేయడం ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పల్లె సంస్కృతి ఉట్టిపడేలా సాగిన ఈ ప్రదక్షిణలు భక్తి సంప్రదాయాలకు అద్దం పట్టాయి. అనంతరం రాత్రివేళ స్వామివారిని గ్రామ వీధుల్లో ఘనంగా ఊరేగించారు. ఊరేగింపు సాగినంత సేపూ భక్తులు ఇంటింటా హారతులు పట్టి స్వామివారికి నీరాజనాలు అర్పించారు. భక్తి గీతాలు, కోలాటాలతో ప్రతి వీధి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. లోక కల్యాణం కోసం, గ్రామానికి శాంతి శ్రేయస్సులు కలగాలని భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఉత్సవాల సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.

