లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఐక్య పోరాటం
కార్మిక, కర్షక మైత్రితోనే హక్కుల రక్షణ
సీఐటీయూ రాష్ట్ర నేత మందా నరసింహారావు
కొత్తగూడెంలో ఘనంగా ‘కార్మిక ఉత్సవ్’ ప్రారంభం
కాకతీయ, కొత్తగూడెం: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లు కార్మిక హక్కులను కాలరాసేలా ఉన్నాయని, వీటికి వ్యతిరేకంగా కార్మికులు, కర్షకులు ఐక్యంగా ఉద్యమించాలని సీఐటీయూ రాష్ట్ర నేత, సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మందా నరసింహారావు పిలుపునిచ్చారు. సీఐటీయూ కొత్తగూడెం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మే 1 నుండి 7 వరకు నిర్వహించనున్న ‘కార్మిక ఉత్సవ్’ మేడే వారోత్సవాలు శనివారం హనుమాన్ బస్తీ సెంటర్లో ఘనంగా ప్రారంభమయ్యాయి.
హక్కుల భక్షణను అడ్డుకోవాలి..
సభకు అధ్యక్షత వహించిన పట్టణ కార్యదర్శి భూక్య రమేష్తో కలిసి మందా నరసింహారావు ప్రసంగిస్తూ.. స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితో, మేడే అమరవీరుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న 28 కార్మిక చట్టాలను కేంద్రం తుంగలో తొక్కిందని మండిపడ్డారు. కార్మికుల శ్రమను దోచుకుని బడా పెట్టుబడిదారులకు కట్టబెట్టేలా నూతన లేబర్ కోడ్లు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మతోన్మాద విధానాలతో పెత్తనం చెలాయించాలని చూస్తున్న శక్తులకు వ్యతిరేకంగా పోరాటాలు ఉధృతం చేయాలని కోరారు.
వాడవాడలా చైతన్యం..
మేడే అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, ప్రస్తుత పరిస్థితుల్లో కార్మిక వర్గం పోషించాల్సిన పాత్రను వివరించేందుకు ఈ ‘కార్మిక ఉత్సవ్’ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నివాస ప్రాంతాల్లో జరిగే ఈ వారోత్సవాలలో కార్మికులు తమ కుటుంబాలతో సహా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్మిక సమస్యల పరిష్కారం కోసం సాగే పోరాటాలకు ప్రజలు కూడా అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి భూక్య రమేష్, జిల్లా కమిటీ సభ్యులు లిక్కి బాలరాజు, అంబాల దుర్గమ్మ, నందిపాటి రమేష్, సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకులు గూగులోత్ సక్రాం పాల్గొన్నారు. అలాగే ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు రాజారావు, ప్రకాష్, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి సమ్మయ్య, కళాకారులు రాములు, రఘు తదితరులు పాల్గొని తమ గళాన్ని వినిపించారు.

