పంట చేతికొచ్చే వేళ ప్రకృతి పగ
కన్నీటిలో మునిగిన రైతాంగం
అకాల వర్షం రైతాంగం అల్లకల్లోలం
అన్నదాత ఆవేదనకు అంతే లేదు
తూకం వేసిన బస్తాలు తడిసి ముద్ద
నిమిషాల్లో నాశనం చేసిన కుండపోత వాన
కాకతీయ ముదిగొండ : పండించిన పంట చేతికొచ్చే వేళ ప్రకృతి ప్రతాపం చూపడంతో ముదిగొండ మండల రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా మారిన వాతావరణం, ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షం అన్నదాతను నిలువునా ముంచేసింది. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం కళ్లముందే తడిసి ముద్దవ్వడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. రోడ్లపైన, కళ్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన వరి, మొక్కజొన్న కుప్పలు వర్షంలో నానిపోయాయి. గాలిదుమారానికి పట్టాలు ఎగిరిపోవడంతో పంటను కాపాడుకోలేక రైతులు నిస్సహాయ స్థితిలో రోదించిన దృశ్యాలు హృదయ విదారకంగా మారాయి.
బాణాపురంలో బీభత్సం
ముదిగొండ మండలం బాణాపురం గ్రామంలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఇక్కడ కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసి సిద్ధంగా ఉంచిన బస్తాలను నెలరోజులుగా తరలించకపోవడంతో వానకు పూర్తిగా తడిసిపోయాయి. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని రైతులు మండిపడుతున్నారు. లారీలు రాక, అధికారులు స్పందించక తమ భవిష్యత్తు అంధకారమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట తడిసిపోవడంతో పెట్టుబడులు కూడా రావని, అప్పులు ఎలా తీర్చాలో తెలియక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
తక్షణమే కొనుగోలు చేయాలి
వందల క్వింటాళ్ల పంట వర్షంలో తడుస్తున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తారో లేక తిరస్కరిస్తారోనన్న భయం రైతుల్లో నెలకొంది. ప్రభుత్వం వెంటనే స్పందించి తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని, నిల్వ ఉన్న ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన గోదాములకు తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. అన్నం పెట్టే అన్నదాత కంట నీరు రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, పాలకులు తక్షణమే ఆదుకోవాలని రైతాంగం కోరుతోంది.

