రైతుకు అండగా ప్రజా ప్రభుత్వం
రుణమాఫీ, రైతు భరోసాతో కొండంత అండగా ఉంటున్నాం
రైతు సంక్షేమమే మా ప్రభుత్వ ధ్యేయం
భూభారతితో వివాదాలన్నీంటికి పరిష్కారం చూపుతాం
జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఆర్ట్స్ కళాశాలలో మూడు రోజుల మెగా రైతు మేళా ప్రారంభం
కాకతీయ, వరంగల్ బ్యూరో: రూ.2 లక్షల పంట రుణమాఫీ, రైతు భరోసాతో అన్నదాతలకు కొండంత అండగా నిలుస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. హనుమకొండలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా మూడు రోజుల పాటు నిర్వహించనున్న రాష్ట్రస్థాయి మెగా రైతు మేళాను మంగళవారం ఉదయం ఆయన ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, దనసరి అనసూయ సీతక్క, వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు (ఎంపీ) డాక్టర్ కడియం కావ్య, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి తదితరులతో కలిసి ఆయన జ్యోతి ప్రజ్వలన చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వేలాది మంది రైతులు ఈ మేళాకు తరలివచ్చారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా చేసుకుని పనిచేస్తోందని స్పష్టం చేశారు. రైతులకు సబ్సిడీపై ఆధునిక వ్యవసాయ యంత్రాలు అందజేస్తూ వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రూ.2 లక్షల పంట రుణమాఫీని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని, ఇప్పటివరకు 25 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్లకు పైగా రుణమాఫీ అందించినట్లు వెల్లడించారు. వీటితో పాటు సన్న వడ్లకు కనీస మద్దతు ధరతో పాటు క్వింటాలుకు రూ.500 బోనస్, ఎకరాకు రూ.12,000 రైతు భరోసా వంటి పథకాలను ప్రభుత్వం బాధ్యతాయుతంగా అమలు చేస్తోందన్నారు.

భూ సమస్యల శాశ్వత పరిష్కారం
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి ‘భూభారతి’ వంటి కార్యక్రమాలు చేపట్టి గ్రామస్థాయిలోనే సమస్యలను పరిష్కరిస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వివరించారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. మంత్రి దనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ వ్యవసాయాన్ని సులభతరం చేసేందుకు సబ్సిడీపై పెద్దఎత్తున వ్యవసాయ యంత్రాలు అందజేస్తున్నామని చెప్పారు. ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ సాగులో రైతులు ఆధునిక పద్ధతులు అవలంబించాల్సిన అవసరం ఉందని, రైతు భరోసా, రైతు బీమా పథకాల ద్వారా ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. కాగా, ఈ మెగా మేళాలో దాదాపు 150 స్టాల్స్‌ను ఏర్పాటు చేసి వినూత్న వ్యవసాయ పద్ధతులు, ఆధునిక యంత్ర పరికరాలు, శాస్త్రీయ సాగు విధానాలను ప్రదర్శించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు స్టాల్స్‌ను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వివిధ ప్రభుత్వ పథకాలు, ఆధునిక సాంకేతికతలపై అవగాహన పెంచుకునేందుకు రైతులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపడంతో మేళా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు (ఎంపీ) డాక్టర్ కడియం కావ్య, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ ప్రతినిధులు, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన వేలాది మంది రైతులు పాల్గొన్నారు.

