ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యత తప్పనిసరి
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి
రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలి
చర్ల మండలంలో కలెక్టర్ అంకిత్ విస్తృత పర్యటన
కాకతీయ, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా సత్యనారాయణపురం గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలతో పాటు చర్ల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని (సీహెచ్‌సీ) ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి అధికారులతో సమీక్షించారు. సత్యనారాయణపురం గ్రామంలోని పెద్దపల్లి–ముమ్మిడివరం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్.. ఇప్పటివరకు సేకరించిన ధాన్యం పరిమాణం, రవాణా పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలిస్తూ.. ఎండల తీవ్రత దృష్ట్యా తాగునీరు, నీడ సదుపాయంతో పాటు తార్పాలిన్లు, హమాలీలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రానికి వచ్చిన రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఇందిరమ్మ ఇళ్ల నాణ్యతపై ప్రత్యేక దృష్టి
అనంతరం సత్యనారాయణపురం గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను కలెక్టర్ పరిశీలించారు. కాకర్లపూడి విజయలక్ష్మి పూర్తి చేసిన ఇల్లు, చినిగిరి రాజు రూఫ్ స్థాయిలో ఉన్న ఇల్లు, కారం నాగరాజు స్లాబ్ దశలో ఉన్న ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని, పునాది నుంచి స్లాబ్ వరకు ప్రతి దశలోనూ ఇంజనీరింగ్ ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని అధికారులను ఆదేశించారు. ఇసుక, సిమెంట్, ఇనుము వంటి సామగ్రి నాణ్యంగా ఉండేలా చూస్తూ నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. గ్రామంలో మంజూరైన 27 ఇళ్లలో ప్రస్తుతం 25 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయని, మిగిలిన 2 ఇళ్లకు కూడా వెంటనే పనులు ప్రారంభించాలని (గ్రౌండింగ్) ఆదేశించారు. పేదలకు నాణ్యమైన గృహ వసతి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, పనులన్నీ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
ఆసుపత్రి తనిఖీ.. రోగులతో సంభాషణ..!
చర్ల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్.. ఓపీ విభాగం, మేటర్నిటీ వార్డు, డయాలసిస్ కేంద్రం, మందుల నిల్వ గది, వంట గదిని తనిఖీ చేశారు. ఓపీ విభాగంలో ఉన్న రోగులతో మాట్లాడి ఆసుపత్రిలో అందుతున్న సేవలపై ఆరా తీశారు. రోగులకు అందించే ఉచిత మందుల నిల్వలను పరిశీలించి, అవసరమైన ఔషధాల కొరత లేకుండా ఎప్పటికప్పుడు స్టాక్‌ను అప్డేట్ చేయాలని సూచించారు. రోగులకు పరిశుభ్రమైన, పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించాలన్నారు. ఆసుపత్రిలో తాగునీటి కొరత ఉన్నట్లు గుర్తించిన కలెక్టర్.. మిషన్ భగీరథ అధికారులతో సమన్వయం చేసుకుని తక్షణమే నిరంతర నీటి సరఫరాను పునరుద్ధరించాలని ఆదేశించారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట తహసిల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీవో ఈదయ్య, గృహ నిర్మాణ శాఖ ఏఈ ముకేశ్, ఏఓ లావణ్య, మిషన్ భగీరథ ఏఈలు అరుణ్, రాము, సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ డాక్టర్ సాయి వర్ధన్, డాక్టర్లు రాంప్రసాద్, రవికుమార్, తిరుపతిరావు, జాన్ మరియు ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

