రాజీవ్ యువ వికాసం’ అమలెక్కడా
హామీలు ఇచ్చి ఏడాదవుతున్నా మంజూరు కాని రుణాలు
ఖమ్మం జిల్లాలో ఒక్క బంజారా యువకుడికీ లోన్ రాలేదు
ప్రభుత్వంపై భారతీయ గోర్ బంజారా పోరాట సమితి ఆగ్రహం.. మహాధర్నాకు పిలుపు
కాకతీయ, కారేపల్లి: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన “రాజీవ్ యువ వికాసం” పథకం అమలులో తీవ్ర జాప్యం చోటుచేసుకోవడంపై యువతలో తీవ్ర ఆందోళన, ఆగ్రహం వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఈ పథకం అమలును పూర్తిగా గాలికొదిలేసిందని భారతీయ గోర్ బంజారా పోరాట సమితి ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు బానోత్ దుర్గాప్రసాద్ నాయక్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ. 6,000 కోట్ల భారీ వ్యయంతో ప్రకటించిన ఈ పథకం కేవలం కాగితాలకే పరిమితమైందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది (2025) ఏప్రిల్ 5 నాటికే దరఖాస్తుల ప్రక్రియ ముగిసిందని, ఇప్పటికి దాదాపు 11 నెలలు గడిచినా ఒక్కరికి కూడా లోన్ మంజూరు చేయకపోవడం దారుణమన్నారు. గతేడాది జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దాదాపు 5 లక్షల మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు, చెక్కులు అందజేస్తామని ముఖ్యమంత్రి స్వయంగా హామీ ఇచ్చి కూడా మాట తప్పారని మండిపడ్డారు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క బంజారా యువకుడికి కూడా రుణ సహాయం అందకపోవడం శోచనీయమన్నారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ వర్గాల నిరుద్యోగ యువతకు రూ. 50 వేల నుండి రూ. 4 లక్షల వరకు 60 శాతం నుండి 100 శాతం సబ్సిడీతో లోన్లు ఇస్తామని ఆశ చూపి మోసం చేశారని దుర్గాప్రసాద్ నాయక్ ఆరోపించారు. జిల్లాలో వేలాది మంది బంజారా యువత ఎంతో ఆశతో దరఖాస్తు చేసుకున్నప్పటికీ, ఇప్పటివరకు కనీసం జిల్లా స్థాయి ఎంపిక కమిటీ సమావేశాలు కూడా జరగకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే దీనిపై స్పందించి.. జిల్లా వారీగా ఎంతమంది లబ్ధిదారులను ఎంపిక చేశారు? ఎంతమందికి లోన్లు ఇచ్చారు? కేటాయించిన రూ. 6,000 కోట్లలో ఎంత మొత్తం ఖర్చు చేశారో పూర్తి వివరాలతో కూడిన శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
బ్యాంకులతో త్వరగా సమన్వయం చేసుకుని లోన్లు మంజూరు చేయాలని, జాప్యానికి కారణమైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. రాబోయే 15 రోజుల్లోగా ప్రభుత్వం దీనిపై స్పష్టమైన ప్రకటన చేయకపోతే, వచ్చే జూన్ 2న (2026) ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ఎదుట వేలాది మంది నిరుద్యోగ బంజారా యువతతో కలిసి “నిరుద్యోగ నిరసన మహాధర్నా” చేపడతామని దుర్గాప్రసాద్ నాయక్ హెచ్చరించారు.

