రైతులకు సేవ చేయడమే లక్ష్యం
చింతకాని పీఏసీఎస్ చైర్మన్ కొండపల్లి శేఖర్ రెడ్డి
కాకతీయ, చింతకాని: రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్) పాలకవర్గాలను తిరిగి కొనసాగించాలని హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో, బుధవారం చింతకాని సొసైటీ చైర్మన్‌గా కొండపల్లి శేఖర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. గతంలో ఉన్న పాలకవర్గాలనే కొనసాగించాలన్న న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆయన డైరెక్టర్లతో కలిసి సొసైటీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం చైర్మన్ కొండపల్లి శేఖర్ రెడ్డి పాలకవర్గ సభ్యులు, అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని రైతులకు సొసైటీ ద్వారా అందాల్సిన అన్ని సేవలు, సదుపాయాలను సకాలంలో అందించడమే తమ ప్రథమ లక్ష్యమని స్పష్టం చేశారు. ముఖ్యంగా వ్యవసాయ పనుల సమయంలో రైతులు ఎరువులు, విత్తనాలు లేదా రుణాల కోసం ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో సొసైటీ సీఈవో శ్రీనివాసరావు, సొసైటీ పాలకవర్గ సభ్యులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

