సిద్ధిపేటలో నకిలీ డాక్టర్ గుట్టురట్టు
ఎంబీబీఎస్, డీఈఎం,ఈఈసీఎంగా చెలామణి అవుతున్న అజయ్ కుమార్
తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆకస్మిక తనిఖీలతో బహిర్గతం
నకిలీ సర్టిఫికెట్లు చూపించి జనాలను మోసం చేసిన వైనం
అర్హతల్లేకుండానే క్రిటికల్ కేర్ విభాగంలో రోగులకు చికిత్స
తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తనిఖీలతో అసలు విషయం వెలుగులోకి
నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు
కాకతీయ, సిద్ధిపేట : ఎటువంటి చట్టబద్ధ వైద్య అర్హతలు లేకుండా చలామణి అవుతున్న ఓ నకిలీ వైద్యుడి ఉదంతాన్ని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీజీఎంసీ) విజిలెన్స్ బృందం బట్టబయలు చేసింది. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఛైర్మన్ డా. కె. మహేష్ కుమార్, రిజిస్ట్రార్ డా. లాలయ్య కుమార్ ఆదేశాల మేరకు బుధవారం సిద్ధిపేటలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. కౌన్సిల్‌కు అందిన గోప్య సమాచారం ప్రకారం.. సిద్ధిపేట శివాజీ నగర్‌లో ఉన్న లలిత భవాని హాస్పిటల్‌పై విజిలెన్స్ బృందం దాడి చేసింది. ఈ తనిఖీలలో జె. అజయ్ కుమార్ అనే వ్యక్తి తాను ఎంబీబీఎస్, డీఈఎం,ఈఈసీఎం, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ అని చెప్పుకుంటూ, ఎలాంటి చట్టబద్ధ వైద్య అర్హత పత్రాలు లేకుండానే ఏడాది కాలంగా క్రిటికల్ కేర్ విభాగంలో రోగులకు అక్రమంగా చికిత్స అందిస్తున్నట్టు గుర్తించారు. తాను ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేశానని, కార్పొరేట్ ఆసుపత్రులలో క్రిటికల్ కేర్ శిక్షణ పొందానని నమ్మించేందుకు సదరు వ్యక్తి నకిలీ సర్టిఫికెట్లు సృష్టించినట్లు విచారణలో తేలింది.
యాజమాన్యం తీరుపై విస్మయం:
సదరు వ్యక్తి నకిలీ వైద్యుడని తెలిసినప్పటికీ.. “పేషంట్ అడ్మిషన్లు మా ఆధ్వర్యంలోనే జరుగుతాయి, అతను మా మార్గదర్శకాల ప్రకారమే పని చేస్తాడు” అంటూ ఆసుపత్రి యాజమాన్యం, డా. రాజేశ్వర్ ఎండీ జనరల్ ఫిజీషియన్) అతడిని సమర్థించేందుకు ప్రయత్నించడం తీవ్ర ఆందోళన కలిగించింది. దీంతో సదరు నకిలీ వైద్యుడిని తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం విజిలెన్స్ అధికారులు పోలీసులకు అప్పగించారు. ఈ తనిఖీలలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ విజిలెన్స్ బృంద సభ్యులు డా. వి. నరేష్ కుమార్, డా. కె. వెంకట స్వామి, విజిలెన్స్ ఆఫీసర్ ఎం. రాకేష్ పాల్గొన్నారు.

