వడ్లు, మొక్కజొన్నల కొనుగోళ్లను చేయాలి
సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్
జాతీయ రహదారిపై ధర్నాకు దిగిన సీపీఐ నేతలు
కాకతీయ,చేర్యాల : వడ్లు మొక్కజొన్నలను కొనుగోలు చేయడంలో రైతులను అధికారులు ఇబ్బందులకు గురి చేయడాన్ని నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో గురువారం చేర్యాల వ్యవసాయ మార్కెట్ ఎదుట జాతీయ రహదారిపై రైతులతో కలిసి గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. చేర్యాల సీఐ బానోతు రమేష్ నాయక్ అక్కడికి చేరుకొని తహసీల్దార్ దిలీప్ నాయక్ తో మాట్లాడి త్వరితగతిన కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని నచ్చ చెప్పడంతో ఆందోళన విరమించారు. ఈసందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ మాట్లాడుతూ.. రైతులు లక్షల్లో పెట్టుబడులు పెట్టి ఆరుగాలం కష్టపడి పండించిన వడ్లు, మక్కలు అమ్మకానికి చేర్యాల మార్కెట్ యార్డుకు తీసుకొచ్చి 20 రోజుల నుంచి నెల వరకు రాత్రింబవళ్లు కష్టపడి ఆరబోసి ఎండబెట్టిన ధాన్యానికి గన్ని సంచులు, తాలు పట్టె మిషన్లు అందుబాటులో లేవని రైతులను గత నెల రోజులుగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్ని సంచులు అందుబాటులో లేకపోవడంతో దళారులకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. మార్కెట్ లో జల్లి మిషన్లు, త్రాగునీరు, విద్యుత్ దీపాలు, పరదలు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా కొనుగోళ్లను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ చెబుతున్నప్పటికీ కింది స్థాయి అధికారులు మాత్రం అందుకు విరుద్ధంగా పని చేస్తున్నారని మండిపడ్డారు.తక్షణమే కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులను ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఈరి భూమయ్య, మండల కోశాధికారి నంగి కనకయ్య, మండల కార్యవర్గ సభ్యుడు సుంకోజు రజిత తదితరులు పాల్గొన్నారు.

