పురాతన శివాలయాన్ని పునర్నిర్మించాలి
హిందూ సమాజ మనోభావాలపై దాడి సహించం
బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి
మట్టి కోటలో ధర్మాగ్రహ దీక్ష.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
కాకతీయ, నర్సంపేట టౌన్ : ఖానాపూర్ మండలం అశోక్ నగర్ గ్రామంలోని కాకతీయుల కాలం నాటి పురాతన శివాలయాన్ని కూల్చివేయడంపై నిరసనలు ఉధృతమయ్యాయి. కూల్చివేసిన స్థలంలోనే ఆలయాన్ని పునర్నిర్మించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి శుక్రవారం మట్టి కోటలో ‘ధర్మాగ్రహ దీక్ష’ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయాన్ని ధ్వంసం చేయడం హిందూ సంస్కృతిపై జరిగిన దాడి అని మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పునర్నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీక్ష అనంతరం వేద పండితులతో కలిసి ఆలయ ప్రాంగణాన్ని గంగాజలంతో శుద్ధి చేసి శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఘటనకు బాధ్యులైన కాంట్రాక్టర్, జేసీబీ డ్రైవర్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఆలయ నిర్మాణంపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు జూలూరి మనీష్ గౌడ్, రాధారపు అశోక్, గూడూరు సందీప్, తనుగుల అంబేద్కర్, తడుక వినయ్ గౌడ్, నాయిని అశోక్, దుంక దువ్వ రంజిత్, గంగిడి మహేందర్ రెడ్డి, శీలం సత్యనారాయణ, కుంభం కోమల్ రెడ్డి, వసంతకుమారి, మార్త సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.

