రోహింగ్యాలకు అడ్డాగా ఖమ్మం
అండగగా నిలుస్తున్న మాజీమంత్రి అజయ్ ఖాన్
ఓటు బ్యాంకు రాజకీయాలకు కాంగ్రెస్, బీఆర్ ఎస్ నేతల మద్దతు
బెంగాల్లో ఏరేసినట్లుగా ఇక్కడా అక్రమ వలసదారులను వెళ్లగొట్టాలి
బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు
మే 10న భాగ్యనగరానికి కదలిరావాలంటూ బీజేపీ శ్రేణులకు పిలుపు
ఖమ్మం నుంచి సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినట్లు వెల్లడి
కాకతీయ,ఖమ్మం బ్యూరో : ఖమ్మం నగరం రోహింగ్యాలకు అడ్డాగా మారిందని, మాజీ మంత్రి అజయ్ కుమార్ వారికి ‘అజయ్ ఖాన్’లా మారి అండగా నిలుస్తున్నారని బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు అక్రమ వలసదారులను ప్రోత్సహిస్తున్నారని ఆయన మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్లో అక్రమ వలసదారులను ఏరివేసినట్లుగానే, ఖమ్మంలోనూ వారిని గుర్తించి వెళ్లగొట్టాలని డిమాండ్ చేశారు. అక్రమ రవాణా, వలసల వల్ల స్థానిక శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ వలసలకు కొమ్ముకాస్తున్న విపక్షాల కుటిల రాజకీయాలను తుదముట్టించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు పిలుపునిచ్చారు.
అక్రమ వలస దారులకు అజయ్ ఖాన్ అండ
ఖమ్మం జిల్లా ప్రస్తుతం అక్రమ వలసదారులకు అడ్డాగా మారుతోందని, గత మంత్రులు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం రోహింగ్యాలకు ఆధార్, రేషన్ కార్డులు ఇప్పించి దేశ భద్రతను ప్రమాదంలో పడేస్తున్నారని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వంలో పనిచేసిన అజయ్ కుమార్‌ను ‘అజయ్ ఖాన్’గా సంబోధిస్తూ, అక్రమ వలసదారులకు ఆయన పూర్తి మద్దతు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు కేవలం స్వార్థ ప్రయోజనాల కోసమే దేశద్రోహ శక్తులకు కొమ్ముకాస్తున్నాయని, దీనివల్ల జిల్లాలో స్లీపర్ సెల్స్ కార్యకలాపాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీరును తప్పుబడుతూ, కాంగ్రెస్ అంటే ముస్లిం పార్టీ అనేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్లో రోహింగ్యాలను తరిమికొట్టిన తరహాలోనే, తెలంగాణలోనూ బీజేపీ అక్రమ వలసలను అడ్డుకుంటుందని స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుస్తోందని నేతలు ఉద్ఘాటించారు.
ప్రధాని సభకు తరలి రావాలి..!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనను చారిత్రాత్మక విజయవంతం చేయాలని, అక్రమ వలసలకు కొమ్ముకాస్తున్న విపక్షాల కుటిల రాజకీయాలను తుదముట్టించాలని నెల్లూరి కోటేశ్వరరావు, ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయిల వెంకట్ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా తెలంగాణ గడ్డపైకి వస్తున్నారని, ఈ నెల 10వ తేదీ ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే బహిరంగ సభ రాష్ట్ర అభివృద్ధికి దిశానిర్దేశం చేస్తుందని అభివర్ణించారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ చారిత్రాత్మక సభకు ఖమ్మం జిల్లా నుంచి దళిత సోదరులు, జాతీయవాదులు భారీ సంఖ్యలో తరలిరావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సికింద్రాబాద్ సభకు వెళ్లే ప్రజల కోసం జిల్లా నుంచి ప్రత్యేక ఏర్పాట్లు చేశామని నేతలు వెల్లడించారు. ఎర్రుపాలెం నుంచి సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుందని, ఈ రైలు ఆదివారం ఉదయం 8:30 గంటలకు ఖమ్మం రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుందని తెలిపారు. రైతులు, మహిళలు, యువత అధిక సంఖ్యలో తరలివచ్చి మోదీకి ఘనస్వాగతం పలకాలని విజ్ఞప్తి చేశారు. దేశ రక్షణ, అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ ఈ సభలో పాల్గొని మోదీకి అండగా నిలవాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు సన్నీ ఉదయ్ ప్రతాప్, ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు కోటమర్తి సుదర్శన్, జిల్లా ప్రధాన కార్యదర్శులు ప్రభాకర్, సీనియర్ నాయకులు మందడపు సుబ్బారావు, మేకల నాగేందర్ , రజనీ రెడ్డి, మంద సరస్వతి , నక్కల రవి గౌడ్,శ్రీరామనేని మణి, తదితరులు పాల్గొన్నారు.

