మిల్లర్ల తరుగు దోపిడీ
హకా కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లలో అన్యాయం
అదనపు తూకంతో అన్నదాతల ఆవేదన
కాకతీయ, చిగురుమామిడి : చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి హకా ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్లు తరుగు పేరుతో నిలువు దోపిడీకి పాల్పడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకుందామంటే, మిల్లర్లు రకరకాల వంకలతో కోతలు విధిస్తున్నారని వాపోతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కాకుండా, కొనుగోలు కేంద్రంలో ఒక్కో బస్తాకు 43.500 కిలోల చొప్పున తూకం వేస్తూ మిల్లులకు తరలిస్తున్నారు. ఇంతటితో ఆగకుండా, మిల్లుకు చేరుకున్నాక ధాన్యం నాణ్యత బాగాలేదని, తేమ ఎక్కువగా ఉందంటూ మిల్లర్లు కొర్రీలు పెడుతున్నారు. ప్రతి లోడుకు అదనంగా మరో 3 నుంచి 4 బస్తాల వరకు కోత విధిస్తున్నారని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.
చర్యలు తీసుకోవాలని డిమాండ్
పెట్టుబడుల భారంతో ఇప్పటికే కుదేలైన రైతులకు, మిల్లర్ల అక్రమ కటింగ్స్ కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. క్షేత్రస్థాయిలో అధికారులు పర్యవేక్షించకపోవడంతోనే మిల్లర్లు ఆగుడాలు సాగుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఇందుర్తి కేంద్రంలో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపి, తమకు న్యాయం చేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.

