అధికారులకు ముడుపులిచ్చాం.. మమ్మల్ని ఆపేదెవరు
అక్రమ ఇటుక బట్టీల వ్యాపారుల బహిరంగ సవాల్
కాకతీయ కథనాలపై మైనింగ్, పొల్యూషన్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం
ఇటుక బట్టీల పొగతో నరకం చూస్తున్న తురకగూడెం గ్రామస్థులు
కాకతీయ, కూసుమంచి: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం తురకగూడెం గ్రామంలో అనుమతులు లేకుండా సాగుతున్న అక్రమ ఇటుక బట్టీల వ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతోంది. తాము నెలన్నర క్రితమే అందరి అధికారులకు ముడుపులు అప్పజెప్పామని, తమను ఎవరూ ఏమీ చేయలేరని అక్రమ వ్యాపారులు బహిరంగంగానే సవాల్ విసురుతున్నారు. పత్రికల్లో ఎన్ని కథనాలు రాసినా మళ్లీ అధికారులు తమతోనే చర్చిస్తారని, ప్రతి ఏటా ముడుపులు చెల్లిస్తూనే ఉన్నామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తురకగూడెం పరిధిలో జరుగుతున్న ఈ అక్రమ వ్యాపారంపై పత్రికల్లో వరుస కథనాలు వస్తున్నప్పటికీ రెవెన్యూ, మైనింగ్, పొల్యూషన్ కంట్రోల్, ఇరిగేషన్, అటవీ శాఖల అధికారులు చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
పొగ, దుమ్ముతో అల్లాడుతున్న స్థానికులు
గ్రామ సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఇటుక బట్టీల నుంచి వెలువడుతున్న దట్టమైన పొగ, దుమ్ము ధూళి కారణంగా స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్వాసకోశ వ్యాధులతో చిన్న పిల్లలు, వృద్ధులు అల్లాడిపోతున్నామని వాపోతున్నారు. కాలుష్యంపై అధికారులకు ఎన్నిసార్లు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని గ్రామస్తులు మండిపడుతున్నారు. అధికారుల అండదండలతోనే వ్యాపారులు ఇంతగా బరితెగించి మాట్లాడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తురకగూడెంలోని అక్రమ ఇటుక బట్టీలపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో వాటిని గ్రామం నుండి తక్షణమే తరలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

