పార్టీ బలోపేతానికి సైనికుల్లా పనిచేయాలి
కేసీఆర్‌ను మళ్లీ సీఎంను చేయడమే లక్ష్యం
త్వరలోనే డిజిటల్ పద్ధతిలో ప్రక్రియ ప్రారంభం
బీఆర్ఎస్ సభ్యత్వ నమోదుపై మాజీ మంత్రి వనమా దిశానిర్దేశం
కాకతీయ, కొత్తగూడెం: బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కొత్తగూడెం నియోజకవర్గ ఇన్ చార్జ్, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. సభ్యత్వ నమోదు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ చార్జ్ రవీందర్ రావు నేతృత్వంలో ఇటీవల జరిగిన ఐదు నియోజకవర్గాల సమీక్షా సమావేశ నిర్ణయాల మేరకు వనమా తన నివాసంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని, కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని కోరారు. త్వరలో ప్రారంభం కానున్న సభ్యత్వ నమోదు ప్రక్రియ కోసం ప్రతి పది పోలింగ్ బూత్‌లకు ఐదుగురు ఇన్ చార్జీలను నియమించనున్నట్లు వనమా తెలిపారు. ఈ ఇన్ చార్జీలు ప్రతి బూత్‌లో ఇద్దరు ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని, వారు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లకు సభ్యత్వం కల్పించేలా చూడాలన్నారు. ఈసారి సభ్యత్వ నమోదు ప్రక్రియ సాధారణ, క్రియాశీల కేటగిరీల్లో పూర్తిగా డిజిటల్ పద్ధతిలో ఉంటుందని, బూత్ ఏజెంట్లకు ప్రత్యేక శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తామని పేర్కొన్నారు. సభ్యత్వ నమోదు పూర్తయిన తర్వాత పార్టీ నూతన కమిటీల నిర్మాణం ఉంటుందని, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన వారికి సముచిత స్థానం దక్కుతుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కిలారు నాగేశ్వరరావు, పాల్వంచ పట్టణ అధ్యక్షుడు మంతపురి రాజు గౌడ్, మల్లెల రవిచంద్ర, కార్పొరేటర్లు బత్తుల మధుచంద్, గుగులోత్ రాంబాబు, సింధు తపస్వి, నాయకులు ముత్యాల ప్రవీణ్, బట్టు మంజుల, దాసరి నాగేశ్వరరావు, సత్యనారాయణ, శేఖర్, చందు నాయక్, లక్ష్మీ నాయుడు, అలివేలు పాల్గొన్నారు.

