బీజేపీ, బీఆర్ఎస్ పోటాపోటీ ధర్నాలు
నేతన్న చౌరస్తాలో పరస్పరం చెప్పులు విసురుకున్న కార్యకర్తలు
లాఠీఛార్జ్ చేసి చెదరగొట్టిన పోలీసులు
సిరిసిల్ల పట్టణంలో హైటెన్షన్.. భారీగా మోహరించిన బలగాలు..
కాకతీయ, రాజన్న సిరిసిల్ల : జిల్లా కేంద్రమైన సిరిసిల్లలో సోమవారం తీవ్ర రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాకు దిగగా, దానికి కౌంటర్‌గా బీజేపీ శ్రేణులు కూడా బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా రోడ్డుపైకి వచ్చాయి. నగరంలోని ప్రధాన కూడలి అయిన నేతన్న చౌరస్తా వేదికగా ఇరు పార్టీల కార్యకర్తలు పోటాపోటీగా ఆందోళనలు చేపట్టడంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపుతప్పింది. ఒకవైపు బండి సంజయ్‌కు వ్యతిరేకంగా బీఆర్ఎస్, మరోవైపు కేటీఆర్‌కు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు భారీ ఎత్తున నినాదాలు చేసుకుంటూ ఒకరిపైకి ఒకరు దూసుకెళ్లారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం కాస్తా తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు చెప్పులు విసురుకుంటూ వీరంగం సృష్టించడంతో నేతన్న చౌరస్తా కాసేపు రణరంగాన్ని తలపించింది.

రంగంలోకి దిగి లాఠీ ఝుళిపించిన పోలీసులు
ఘర్షణ తీవ్రమవడంతో అక్కడే ఉన్న పోలీసులు ఇరు వర్గాలను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ కార్యకర్తలు వెనక్కి తగ్గకుండా పరస్పరం దాడులకు దిగడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి నిరసనకారులను చెదరగొట్టారు. ఈ రాజకీయ ఉద్రిక్తత కారణంగా సిరిసిల్ల పట్టణంలో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నేతన్న చౌరస్తా పరిసరాల్లో పోలీసులు భారీగా బలగాలను మోహరించి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

